‘‘బర్రెకు సున్నం పూస్తే ఆవు అవుతుందా? టీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అవుతుందా? బ్యాంకుల నుండి కోట్లు కొల్లగొట్టి దివాళా తీసిన కంపెనీలు కొత్త బోర్డు తగలించినట్లుగా ఉంది బీఆర్ఎస్ తీరు” అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ద్రుష్టిలో కేసీఆర్ ఇప్పుడు చెల్లని రూపాయి అని, ఆయన ఎన్ని డ్రామాలేసినా… బీఆర్ఎస్సే కాదు.. పీఆర్ఎస్ (ప్రపంచ రాజ్య సమితి) అని పేరు పెట్టుకున్నా ఆయన ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయినట్లే అంటూ స్పష్టం చేశారు.
కేసీఆర్ నిన్న టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెడితే… మంత్రులకు, టీఆర్ఎస్ నేతలకే ఆ కొత్త పార్టీ సంగతి తెల్వట్లేదు. ఇయాళ ఒకాయనేమో బీఎస్పీ అంటున్నడు. ఇంకోకాయనేమో ఇంకో పేరు చెబుతున్నడు అని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త విమానం కొనుక్కుని జాతీయ పార్టీ పేరుతో దేశమంతా తిరుగుతడట. కేసీఆర్, కేఏపాల్ వంటి వాళ్లు మాత్రమే కొత్త విమానాలు కొనుక్కుని తిరిగేటోళ్లు అంటూ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ జెండా, ఎజెండా లేని పార్టీ. టీఆర్ఎస్ స్థాపించినప్పుడున్న వ్యవస్థాపకుల్లో ఇప్పుడెంత మంది ఉన్నరు? ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెట్టిండో కేసీఆర్ సమాధానం చెప్పాలి? అని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అక్రమాల బండారం బయటపడుతుంటే చర్చను దారి మళ్లించేందుకు, కొడుకును సీఎంగా చేసేందుకు, బిడ్డకు కేంద్రంలో ఏదో ఒక పని కల్పించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పెట్టిండు అంటూ విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను చీత్కరిస్తున్నరు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొత్త పార్టీ పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నడు. ఈ సంగతి తెలిసే బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామాలాడుతున్నడు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మి ఓట్లేస్తే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి బీఆర్ఎస్ పై పోటీ చేసి ప్రజాతీర్పుకు సిద్ధపడాలి. నేనడుగుతున్నా… మునుగోడులో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి?
కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. గత 8 ఏండ్లలో పంట నష్టపోయిన ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. పంజాబ్ కు పోయి పైసలిచ్చినవే.. ఇక్కడి రైతులేం పాపం చేసిండ్రు. వడ్ల కుప్పలపై పడి చనిపోయినా కనికరించలేదు అంటూ విమర్శించాలు గుప్పించారు.
“నీ దుర్మార్గపు పాలనలో రైతులు రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటున్నరు. కౌలు రైతులను ఏనాడూ ఆదుకోలే. తెలంగాణలో వరి వేస్తే ఉరి అన్నవ్…ఇప్పుడు గోధుమ పంట వేస్తే గొయ్యి..నువ్వుల పంట వేస్తే నుయ్యి అనడమే నీ నూతన పంటల విధానమా?” అంటూ ప్రశ్నించారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సర్వనాశం చేసి 5 లక్షల కోట్ల అప్పులపాల్జేసి ఒక్కో తలపై 1 లక్షా 20 వేల భారం మోపడమే తెలంగాణ మోడలా? ప్రభుత్వ ఆస్తులతోపాటు యావత్ తెలంగాణ ఆస్తులన్నీ బ్యాంకులకు, కార్పొరేషన్లకు కుదువ పెట్టి దోచుకోవడమే తెలంగాణ మోడలా? నీ లిక్కర్ పాలసీతో తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేసి మహిళల పుస్తెలు తెంపడమే దేశానికి ఆదర్శమా?
కేసీఆర్ మాటలెట్లా ఉన్నాయంటే…. మూసీ నదిని ప్రక్షాళన చేయలేనోడు దేశంలోనే అతి పెద్ద గంగా నది గురించి మాట్లాడుతున్నడు… పక్క రాష్ట్రాలతోనున్న చిన్న చిన్న వివాదాలను పరిష్కరించలేనోడు దేశ సరిహద్దుల గురించి మాట్లాడుతున్నడు. మంచి గుణం లేనోడు గుణాత్మక మార్పు గూర్చి మాట్లాడుతున్నడు… సైనికులను కించపరిచోడు దేశ రక్షణ గూర్చి మాట్లాడుతున్నడు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్ పాటపాడేటోడు దేశ భక్తి గురించి లెక్చర్ ఇస్తున్నడు? తెలంగాణలో ఉద్యోగులకు సరిగ్గా జీతాలే ఇయ్యలేనోడు ఈ దేశ ప్రజల జీవితాలు మారుస్తానంటున్నడు.
బీఆర్ఎస్ పేరుతో ఆడుతున్నదంతా పెద్ద డ్రామా. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ముఖం చెల్లడం లేదు. మునుగోడు ఎన్నికల నుండి రాష్ట్ర ప్రజల ద్రుష్టిని మళ్ళించేందుకు ఆడుతున్న నాటకమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నడు. రేపు ప్రపంచ రాజ్య సమితి (పీఆర్ఎస్) కూడా పెడతాడేమో. రేపో మాపో ఐక్య రాజ్య సమితి కూడా అత్యవసర సమావేశం పెట్టి దీనిపై చర్చిస్తదేమో (ఎద్దేవా చేస్తూ…).. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనగానే సోషల్ మీడియాలో నెటిజన్లంతా సెటైర్లు వేస్తూ పొట్టుపొట్టు తిడుతున్నరు.
టీఆర్ఎస్ పేరుతో అక్రమంగా సంపాదించిన సొమ్ము, అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోంది. పార్టీలో అసమ్మతి మొదలైంది. ఇటు వంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి, ట్విట్టర్ టిల్లును సీఎంను చేయడానికి, లిక్కర్ క్వీన్ ను కాపాడటానికి ఆడుతున్న డ్రామాయే బీఆర్ఎస్. మజ్లిస్ పార్టీతో కలిసి మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న చోట పోటీ చేసి 30. 40 సీట్లను సాధించుకుని చక్రం తిప్పి దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. అందుకోసం మజ్లిస్ సహా చిన్నాచితకా పార్టీలతో కలిసి పోటీ చేయబోతున్నడు. కేసీఆర్ ఎన్ని డ్రామాలాడినా నువ్వు చెల్లని రూపాయిగా మారినవ్. ఆయనను ఎవరూ దేఖడం లేదు. మునుగోడు ఫలితాలతోనే కేసీఆర్ ఖేల్ ఖతం, దుకాణం బంద్ కాబోతోంది.