దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను అప్పగిస్తారా? అని మీడియా అడిగితే పాక్ అధికారి ఏం అన్నాడంటే
అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోపాటు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయూద్‌ను అప్పగిస్తారా అని భారత మీడియా.. పాక్ అధికారిని ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పేందుకు పాక్ అధికారి నిరాకరించారు.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇంటర్‌పోల్ 90వ వార్షిక సర్వసభ్య సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఇవి ఇంటర్‌పోల్ అత్యున్నత పాలక మండలి సమావేశాలు, దాని పనితీరు సమీక్ష మరియు కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రతి సంవత్సరం ఒకసారి కలుస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఇవి దిల్లీలో జరుతున్నాయి.నాలుగు రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో 195 సభ్య దేశాలనుంచి ఆయా దేశాల మంత్రులు, పోలీస్ చీఫ్‌లు, సెక్యూరిటీ ఏజన్సీల అధిపతులు, అత్యున్నత పోలీసు అధికారులు పాల్గొంటున్నారు. 25 ఏళ్ళ తరువాత భారత్ ఈ సమావేశాలకు ఆతిధ్యం ఇస్తోంది.
దీనికి పాకిస్తాన్‌కు చెందిన కీలక అధికారి, పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తరఫున ఇస్లామాబాద్ నుంచి మోహ్సిన్ భట్ హాజరయ్యారు. ఆయనను అక్కడున్న భారత మీడియా ఈ అంశంపై ప్రశ్నించింది. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతోపాటు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయూద్‌ను అప్పగిస్తారా అని మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మోహ్సిన్ భట్ నిరాకరించారు. నో,, నో,, అంటూనే ముక్కు మీద వేలు వేసుకుని, గప్‌చుప్ అన్నట్లుగా సైగ చేశాడు.
భారత్‌లో 1993, ముంబై పేలుళ్లు తీవ్ర కల్లోలం సృష్టించాయి. వీటికి ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం. అలాగే 26/11 దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. వీరిద్దరూ ప్రస్తుతం పాక్‌లోనే రహస్యంగా ఆశ్రయం పొందుతున్నారు. వీరిని విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని భారత్ ఎప్పట్నుంచో కోరుతోంది. కానీ, పాక్ మాత్రం వివిధ కారణాలతో దీనిపై ఆసక్తి చూపడం లేదు. 2003లో దావూద్ ఇబ్రహీంను భారత్, అమెరికాలు అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాయి. భారత్ కూడా అతడి మీద రూ.25 లక్షల బహుమతి ప్రకటించింది.