మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు మునుగోడు లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ నెల 31 న మునుగోడు లో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సభలో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొంటున్నారు.
అంతకు ముందు రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ జరుగనున్నది. పైగా, ఆ మరుసటి రోజు, నవంబర్ 1 ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. దానితో ఈ బహిరంగ సభ ద్వారా బిజెపి బాల ప్రదర్శనకు దిగనున్నది. అప్పులపాలైన తెలంగాణను గాడిన పెట్టాలంటే బీజేపీతోనే సాధ్యం అని పేర్కొంటూ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ చెప్పారు. ప్రజల బతుకులు మారాలంటే సీఎం కేసీఆర్ను గద్దె దింపాలని, టీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆయన పిలుపిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని కేసీఆర్ కొనుక్కున్నడు. ప్రతిపక్షం లేకుండా గొంతు నొక్కేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు. అవినీతి సొమ్ముతో ఇప్పుడు మునుగోడులో నాయకులను కొంటున్నడని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది. ప్రజల బతుకులు మారలేదు. బెల్టు షాపులతో కుటుంబాలను టీఆర్ఎస్ సర్కార్ ఆగం చేస్తున్నదని విమర్శించారు. ఉప ఎన్నిక ఉందని వంద మంది కౌరవ సైన్యం అవినీతి మూటలు పట్టుకుని మునుగోడు పల్లెల్లో మకాం వేసిందని, ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున మునుగోడులో ఎంపీ లక్ష్మణ్ ప్రచారం నిర్వహిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధ్యక్షుడు ఎవరు ఉండాలో కేసీఆరే నిర్ణయిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినేట్లో ఆయన కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే సామాజిక న్యాయం జరిగిందని ఎద్దేవా చేశారు.
ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తుంటే, కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. వివిధ పథకాల పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, అయితే ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది బీజేపీ మాత్రమేనని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.