కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య వెనుక హనీట్రాప్, బ్లాక్మెయిల్ వంటి కోణాలున్నాయని పోలీసులు తెలిపారు. ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు వ్యక్తులు ఆ మఠానికి సంబంధించిన వారేనని వెల్లడించారు.
రామనగర జిల్లాలోని కంచుగల్ బందే మఠాధిపతి సంత్ బసవలింగ స్వామి తన ప్రార్థన మందిరంలో సోమవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లింగాయత్ మఠాలకు చెందిన సాధువులు ఇటీవల వరుసగా మరణిస్తుండటం కర్ణాటకలో కలకలం రేపుతున్నది.
రెండు నెలల క్రితం బెల్గాంలోని గరు మడివళేశ్వర మఠంలో బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభించింది. కాగా, బసవలింగ స్వామి సూసైడ్ నోట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను హనీట్రాప్‌నకు గురైనట్లు, తనను బ్లాక్మెయిల్ చేసి వేధించినట్లు ఆయన ఆరోపించారు.
నాలుగు అసభ్యకర వీడియోలు విడుదల చేస్తామంటూ ఒక మహిళ, మరి కొందరు కలిసి తనను బెదిరించినట్లు ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన స్థానం నుంచి తొలగించాలని భావించిన కొందరు వ్యక్తులు ఇలా కుట్రపన్నిన్నట్లు ఆరోపించారు.
మరోవైపు సూసైడ్ నోట్లో పేర్కొన్న వ్యక్తుల గురించి తమకు తెలిసిందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. కొంతమంది మఠాధిపతులకు రాజకీయ నాయకులతో బాగా సంబంధాలున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మఠం వెలుపల, బయట కూడా రాజకీయాలు ఉండవచ్చని చెప్పారు.
అయితే సూసైడ్ నోట్లో రాజకీయ నాయకుల ప్రస్తావన లేదని పోలీస్ అధికారి తెలిపారు. ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, వైరల్ అవుతున్న నాలుగు వీడియోల్లోని మహిళ ఎవరనే దానిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.