బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. `ఎక్స్’ నుంచి భద్రతను పెంచుతూ ‘వై ప్లస్’ కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
సల్మాన్‌కు తాజాగా పెంచిన భధ్రతా కేటగిరి కింద సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు. మరోవైపు సల్మాన్ ఇంటి వద్ద రోజంతా ఇద్దరు గార్డులు పహారా కాస్తారు. సల్మాన్ భద్రత విధుల్లో ఇప్పటి వరకూ ఒక సాయుధ గార్డు పనిచేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ ఉన్నారనే సమాచారంతో బాలీవుడ్ కండలవీరుడికి భద్రతను పెంచారు. సల్మాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఆయన ఫామ్ హౌస్ వద్ద మాటు వేశారనే సమాచారంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబై పోలీస్ కమిషనర్‌ను కలిసిన అనంతరం ఆయన దరఖాస్తును పరిశీలించిన పోలీసులు ఇటీవల బాలీవుడ్ స్టార్‌కు పర్సనల్ వెపన్ లైసెన్స్ జారీ చేశారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు సైతం మహారాష్ట్ర ప్రభుత్వ భద్రత కల్పించింది.
అక్షయ్ కుమార్‌కు `ఎక్స్’ కేటగిరి భద్రత కేటాయించారు. ఈ కేటగిరి కింద ముగ్గురు భద్రతా అధికారులు షిఫ్టులుగా ఆయనకు భద్రత కల్పిస్తారు. అనుమప్ ఖేర్‌కు సైతం `ఎక్స్’ కేటగిరి భద్రత కల్పించారు. కాగా, తమకు కేటాయించిన భద్రతకు అయ్యే ఖర్చును ఆయా సెలబ్రెటీలే భరిస్తారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్కూ వైప్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు.
ముంబై, పంజాబ్, ఢిల్లీలో జరిపిన దర్యాప్తులలో ఇటీవల పలు విషయాలు బయటకు వచ్చాయి. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లు సల్మాన్‌ఖాన్‌ను ముంబైలోనే మట్టుబెట్టేందుకు ప్లాన్ చేశారు. రెండు సార్లు ఈ ప్రయత్నాలు జరిగినట్టు చెబుతున్నారు.
అనుపమ్ ఖేర్‌కు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలైన తర్వాత బెదరింపులు రావడంతో భద్రత పెంచారు. నేషనాలిటీకి సంబంధించిన విషయంలో సోషల్ మీడియాలో బెదరింపులు రావడంతో అక్షయ్ కుమార్‌కు భద్రత మంజూరైంది.