ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవిఎం)లపై పార్టీ గుర్తులను ముద్రించకుండా నిలిపివేసేలా దాఖలు అయిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఎన్నికల్లో ఈవిఎం, బ్యాలెట్ పేపర్‌పై పార్టీ గుర్తులు ముద్రించకుండా, దానికి బదులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నఅభ్యర్థుల పేరు, వయస్సు, విద్యార్హత, ఫోటోతో ముద్రించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బిజెపి నేత అశ్విని కుమార్ ఉపాధ్యారు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్)ను మంగళవారం సిజెఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ రాజకీయ పార్టీలు, శాసన సభా పక్షాలను గుర్తిస్తుందని తెలిపారు.
”అభ్యర్థికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీతో ఎన్నికలు సమగ్రంగా అనుసంధానించబడి ఉంటాయి. అలా కాకపోతే ఎన్నికైన తరువాత వ్యక్తి మరొక పార్టీలో చేరే అవకాశం ఉంది” అని తెలిపింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, గోపాల్ శంకరనారాయణ్ వాదిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించారని పేర్కొన్నారు.
ఈవిఎంలపై పార్టీ గుర్తులను ముద్రించడం ఓటర్ల ఎంపికను ప్రభావితం చేస్తుందని, ఎన్నికల అభ్యర్థుల విశ్వసనీయత ఆధారంగా ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ నీడలో వ్యక్తులు పూర్తిగా దూరమవుతున్నారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు.