వచ్చే నెల మొదటి వారంలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వమించనున్నారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి విడత పోలింగ్ కోసం ఈ నెల 5న, రెండో విడత కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో.. డిసెంబర్ 1, 5 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు.ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8న చేపడతామని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు.
గుజరాత్ లో ఫిబ్రవరి 18, 2023 తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 51,000 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్ లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 4.61 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారని మీడియా సమావేశంలో సీఈసీ రాజ్ కుమార్ చెప్పారు.ఈసారి జరగనున్నఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు.
కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో 4 పర్యాయాలు కసరత్తు చేసిన అధికారులు.. దేశంలోనే మొదటిసారిగా షిప్పింగ్ కంటైనర్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు. 217 మంది ఓటర్ల కోసం కంటైనర్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కంటైనర్ బూత్‌లో ఉండే అన్ని సదుపాయాలు కల్పిస్తామని… ఒక్క ఓటరు కోసం గిర్ అటవీ ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 33 జిల్లాల పరిధిలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులుంటారని చెప్పారు.
కాగా ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య 11 లక్షల 62 వేలు. ఈ క్రమంలో యువ ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 , కాంగ్రెస్ 77 స్థానాలను దక్కించుకున్నాయి.
ఈ ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగనుంది.బీజేపీ నాయకులు గుజరాత్లో అధికారాన్ని నిలుపుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది.