దేశవ్యాప్తంగా 7 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలుపొందడం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ప్రజలు చూపిన అభిమానానికి కొలమానం అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ తెలిపారు. గతంలో 3 స్థానాలకు అదనంగా మరో సీటు బీజేపీ గెలుచుకుందని చెప్పారు.
బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని, హర్యానాలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ 3 సిట్టింగ్ స్థానాలను కోల్పోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పతనానికి ఇది నిదర్శనం అని స్పష్టం చేశారు. ఆ పార్టీ దేశంలో కనుమరుగవుతోందని చెబుతూ మునుగోడు కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని గుర్తు చేశారు.
బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేడీ ఏకమైనా ఓడించలేకపోతున్నాయని డా. లక్ష్మణ్ తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో సర్కస్ ఫీట్లు చేసినా జనం నమ్మడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా పయనిస్తోందని ఎద్దేవా చేశారు. మునుగోడు ఓటమితో కుంగిపోయే పార్టీ బీజేపీ కాదని, గెలిస్తే పొంగిపోదని చెబుతూ మునుగోడు ఓటమిని విశ్లేషించి బలహీనంగా చోట బలపడటానికి క్రుషి చేస్తామని తెలిపారు.
కేసీఆర్ అవినీతి, అక్రమాలతోపాటు మనీ, మద్యాన్ని ఏరులై పారించినా కేసీఆర్ ఏం సాధించారు? అని ప్రశ్నించారు. ఊరికో ఎమ్మెల్యేను, మంత్రిని నియమించినా, రెండుసార్లు సీఎం వచ్చినా బీజేపీ ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారని గుర్తు చేశారు. ఇది బీజేపీ, రాజగోపాల్ రెడ్డి సాధించిన నైతిక విజయమిదని చెప్పారు. యావత్ ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిదే అని కొనియాడారు. కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎదుర్కొనే ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రజలు నిరూపించారని తెలిపారు.