హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారం లోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఈమేరకు సిమ్లాలో జరిగిన ‘బీజేపీ సంకల్ప్ పాత్ర 2022’ కార్యక్రమంలో 11 పాయింట్ల మేనిఫెస్టోను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు.
ఉమ్మడి సమాజం, యువత, రైతులకు సాధికారత , తోటల పెంపకానికి చేయూత, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన న్యాయం, పర్యాటకానికి మరింత ఊతమివ్వడమే లక్షంగా మేనిఫెస్టోని రూపొందించామని ఆయన చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో వాగ్దానం చేయని లక్షాలను కూడా బీజేపీ సాధించిందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం బీజేపీ పని చేస్తుందని, ప్రలోభాలకు, ఉచితాలకు తమ పార్టీ వ్యతిరేకమని నడ్డా చెప్పారు. శనివారం కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు దశ, దిశ లేదని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోల మధ్య పోలికే లేదని పేర్కొంటూ పెద్దపెద్ద హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదని స్పష్టం చేశారు. 2017లో రాజస్థాన్, చత్తీస్గఢ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదని ఆరోపించారు.
పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై బీజేపీ నేత మంగళ్ పాండే స్పందిస్తూ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఉమ్మడి పౌరస్మృతిలో లక్షాలను నెరవేర్చడం, ప్రభుత్వ ఉద్యోగాలతో సహా రాష్ట్రంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, అన్ని గ్రామాల రోడ్లను పక్కా రోడ్లతో అనుసంధానం, సీఎం అన్నదాత స్కీమ్ ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ధి, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుకు శక్తి పేరుతో కొత్త కార్యక్రమం, యువత కోసం రూ,.900 కోట్లతో స్టార్టప్ యూనిట్, పేద మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లతోపాటు ఇతర హామీల అమలు తదితర అంశాలు మేనిఫెస్టోలో కీలకమైనవి.