ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12న రామగుండంలో జరుపనున్న అధికార పర్యటనకు సహితం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్‌ను జాతికి అంకితం చేయడానికి వస్తున్న ప్రధానికి కనీసం స్వాగతం పలికెదుకు కూడా కేసీఆర్ వెనుకడుగు వేయవచ్చని తెలుస్తున్నది.
ఇది పూర్తిస్థాయిలో అధికారిక కార్యక్రమమే. ప్రధాన మంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు పార్టీలకతీతంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం ఆనవాయితీ. అయితే, గతంలో ప్రధాని చేపట్టిన మూడు పర్యటనలకు గైర్హాజరైనట్లుగానే ఇప్పుడు కూడా కేసీఆర్ వెళ్లడం లేదని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, గతంలో ప్రధాని పాల్గొన్న మూడూ కూడా ప్రైవేటు కార్యక్రమాలు కావడంతో కేసీఆర్ పాల్గొనలేదని అనుకోవచ్చు. ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చారు. కానీ, స్వాగతం పలకడానికి కానీ కార్యక్రమానికి కానీ కేసీఆర్ హాజరు కాలేదు.
అప్పటి నుంచే మోదీ, కేసీఆర్ మధ్య వైరానికి బీజం పడిందనే వాదన ఉంది. రామానుజుల విగ్రహావిష్కరణ శిలాఫలకంపై సీఎం కేసీఆర్ పేరు పేర్కొనకపోవడంతో నొచ్చుకున్నారని, అందుకే వెళ్లలేదనే ప్రచారం జరిగింది.
ఆ తర్వాత మే 26న ప్రధాని మోదీ ఐఎ్‌సబీ ద్వి దశాబ్ది ఉత్సవానికి హాజరయ్యారు. దానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. అదే సమయంలో, బీజేపీయేతర పక్షాలను కూడగట్టడంలో భాగంగా సీఎం కేసీఆర్ అదే రోజు బెంగళూరుకు వెళ్లి, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు.
ప్రధాని హైదరాబాద్‌కు వచ్చిన రోజే కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడంపై అప్పట్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత జూలై 2 నుంచి నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అందులో భాగంగా జూలై 3న ప్రధాని నగరానికి వచ్చారు. అది పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో కేసీఆర్ పర్యటనకు దూరంగానే ఉన్నారు.
ఇప్పుడు అధికారిక పర్యటనలో భాగంగా రామగుండం వస్తున్నా ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్ర రాజధానికి ప్రధాని వస్తే ప్రొటోకాల్‌లో భాగంగా ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి ఉంటుంది.
ఆ అధికారిక పర్యటన రాజధానికి బయట అయితే ప్రభుత్వం తరఫున ప్రతినిధిని పంపవచ్చు. ఇక, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని, దానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం ఉంటుందని, వెళ్లాలా, ప్రతినిధిని పంపాలా అనే అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
12న ప్లాంట్ ప్రారంభంతో పాటు కేంద్ర రైల్వే శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం (భద్రాచలం రోడ్) నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్లు నిర్మించిన రైల్వే లైన్‌ను, నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆధ్వర్యంలో 133 కిలోమీటర్ల మెదక్ ‒సిద్దిపేట‒ఎల్కతుర్తి రోడ్డు, 17 కిలోమీటర్ల సిరివంచ‒మహాదేవపూర్ రోడ్డు, 56 కిలోమీటర్ల బోధన్ ‒ బాసర రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించనున్నారు.