సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయన విధులు నిర్వర్తించనున్నారు. 2024, నవంబర్ 10వ తేదీ వరకు ఆయన సీజేఐగా ఉంటారు. రాష్ట్రపతి భవన్లో ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
జస్టిస్ చంద్రచూడ్ 1959, నవంబర్ 11న జన్మించారు. 1979లో ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎమ్ చేశారు. 1986లో హార్వర్డ్ నుంచే జురిడికల్ సైన్సెస్‌లో(ఎస్జేడీ) డాక్టర్ పట్టా పొందారు.
44 ఏళ్ల క్రితం సీజేఐ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి చేశారు. జస్టిస్ వైవీ చంద్రచూడ్ అత్యధికంగా ఏడేళ్ల పాటు సీజేఐగా చేశారు. 1998 నుంచి 2000 వరకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా జస్టిస్ చంద్రచూడ్ చేశారు. 1998లో బాంబే హైకోర్టులో ఆయన సీనియర్ అడ్వకేట్‌గా నమోదు అయ్యారు.
పౌర, మత, భాషాపరమైన హక్కులతో పాటు అనేక కేసుల్లో ఆయన వాదించారు. 2000, మార్చి 29న బాంబే హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2013, అక్టోబర్ 31న ఆయన అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపాయింట్ అయ్యారు. 2016, మే 13వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చారు.