సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ఈ సమాచారాన్ని ట్విటర్లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటే ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు, డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు.
మెయిన్‌పురి నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996 నుంచి ఎస్పీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తుంది. 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ వచ్చిన 44 ఏళ్ల డింపుల్ యాదవ్… ఆ ఎన్నికల్లో ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఈ తరువాత 2012లో కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె ఏకపక్షంగా గెలిచారు. ఇక 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్నౌజ్ నుండి పోటీ చేసి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయగా బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో 10 వేల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.