అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం సాగదని స్పష్టం చేస్తూ తెలంగాణాలో కేసీఆర్ పాలనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా హెచ్చరిక చేశారు. హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టులో బీజేపీకి కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ పెదాలను దోచుకొనేవారిని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.
పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డు అని పేకరోన్తు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని భరోసా వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుంటున్నారని అంటూ తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు. 22 ఏళ్లుగా ఎందరితోనో ఎన్నో తిట్లు తిన్నాను.. రోజు కిలోల కొద్దీ తిట్లు తింటాను.. అందుకే అలసిపోనని పెక్రోన్నారు.
మోదీని తిట్టేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. చక్కగా తిట్లు వింటూ.. చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలని సూచించారు. తెలంగాణ సర్కార్కు రోజూ మోదీని తిట్టేందుకే సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు. మీరెన్ని తిట్లు తిట్టినా వాటిని అరిగించుకునే శక్తి తమలో ఉందని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ సమాజాన్ని తిడితే మాత్రం అంతకంతా ప్రతీకారం తప్పదని మోదీ హెచ్చరించారు.
గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవని, కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామని గుర్తు చేశారు. రైతుల ఖాతాల్లోనే పీఎం కిసాన్ నిధులు వేస్తామని, నిధులు నేరుగా లబ్ధిదారులకే ఇస్తుండడంతో.. అవినీతిపరులకు కడుపు మండుతోందని ప్రధాని మోదీ చెప్పారు.
‘‘నేను కూడా మీలానే బీజేపీకి చెందిన చిన్న కార్యకర్తను’’ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ కార్యకర్తలను చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. పీపుల్స్ ఫస్ట్.. అనేది బీజేపీ నినాదమని చెబుతూ ఇక్కడి కార్యకర్తలను బలమైన శక్తులు.. ఎవరికీ భయపడరని అభినందించారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు పదవులు అనుభవిస్తున్నారని… ప్రజలకు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రధాని ప్రధాని విమర్శించారు.
తెలంగాణ లో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. మునుగోడు ఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని చెబుతూ ఒక్క సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వమంతా మునుగోడుకు పోయిందని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజు దగ్గరలోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు.
మీరెంత గట్టిగా పోరాడారో ఉపఎన్నిక చూస్తుంటే అర్థమవుతోందని చెబుతూ తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులుండదని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారని ప్రధాని మోదీ అన్నారు.