మహిళలకు మహిళలే శత్రువులని, చదువుకున్న మహిళలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల తన మనుమరాలు నవ్య నవేలీ నంద పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలన్న వ్యాఖ్యలకు ఆమె ఈ విధంగా స్పందించారు. జయా బచ్చన్, ఆమె కుమార్తె శ్వేత బచ్చన్, మనుమరాలు నవ్య నవేలీ నంద పిల్లల పెంపకం గురించి మాట్లాడారు. నవ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలని చెప్పారు. జయ జోక్యం చేసుకుని చదువుకున్న మహిళలు కూడా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని, ఇది చాలా శోచనీయమని చెప్పారు.
ఈ విషయాన్ని చెప్పాలని చాలాసార్లు అనుకున్నానని, అయితే బాగుండదని చెప్పలేదని తెలిపారు. శ్వేత మాట్లాడుతూ, తన తల్లి తన పట్ల అంత బాగా వ్యవహరించరని చెప్పారు. మహిళలు తమ తోటి మహిళలతో మంచిగా ఉండాలని, సహకారం అందించే విధంగా ఉండాలని సూచించారు.
దీనిపై జయా బచ్చన్ స్పందిస్తూ, నవ్యకు తాను చాలా మంచిదాన్నని చెప్పారు. తాను ఎల్లప్పుడూ మహిళలకు సహాయపడుతూనే ఉంటానని, వారి తరపున గళమెత్తుతానని చెప్పారు. తల్లి కూతుళ్ళ గురించి మాట్లాడుకోవద్దని హితవు చెప్పారు. మెడిలీన్ కే అల్బ్రైట్ కోట్‌ను శ్వేత ప్రస్తావించారు. ఇతర మహిళలకు సహాయపడని మహిళలకు నరకంలో ప్రత్యేకంగా ఓ ప్రదేశం ఉంటుందని మెడిలీన్ చెప్పారని తెలిపారు. దాతృత్వం ఇంటి నుంచే, తల్లి నుంచే ప్రారంభం కావాలని చెప్పారు.
జయ, శ్వేత, నవ్య వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను నవ్య పాడ్‌కాస్ట్‌లో పంచుకుంటున్నారు. ‘వాట్ ది హెల్ నవ్య’ పేరుతో జరుగుతున్న తొమ్మిదో ఎపిసోడ్ ఇది. ‘వన్ క్రౌన్, మెనీ షూస్’ అనే టాపిక్‌పై ఈ సంభాషణ జరిగింది.