గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పార్టీలన్ని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రమంత్రులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు ప్రచారం చేపట్టారు.
ఆమ్ ఆద్మీ తరఫున పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌షోలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అహ్మదాబాద్‌లో బీజేపీకి మద్దతుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిస్వా శర్మ ఛలోక్తులు విసిరారు. సద్దాం హుస్సేన్ పోలికల్లో రాహుల్ కనిపిస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో రాహుల్ పర్యటిస్తున్నాడన్న శర్మ ఆయన గుజరాత్లో కనిపించడు.. విజిటింగ్ ఫ్యాకల్టీలా రాష్ట్రానికి వస్తాడని విమర్శించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి ఉంటుందని ఆరోపించారు. ”గుజరాత్లో ఆయన కనిపించడం లేదు. విజిటింగ్ ఫాకల్టీ తరహాలోనే ఆయన రాష్ట్రానికి వస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. ఆయన ఎన్నికలు లేని ప్రాంతాల్లో మాత్రమే పర్యటిస్తుంటారు. బహుశా ఓటమి భయం కావచ్చు” అని శర్మ ఎద్దేవా చేసారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు పెయిడ్ ఆర్టిస్టులుగా బాలీవుడ్ స్టార్స్‌ను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అయితే, హిమంత బిస్వా శర్మపై అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్‌కుమార్ బోరా మండిపడ్డారు. అసోం సీఎంకు ఒక హెడ్లైన్ కావాలని, అప్పుడే రాహుల్ గాంధీ పేరును వాడుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏ స్థాయికైనా శర్మ వెళ్లగలడని విమర్శించారు.