ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు షాక్ తగిలింది. పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ వేధింపులు భరించలేకనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఏడాది నుంచి ఎన్నో అవమానాలు ఎదురుకుంటూ వస్తున్నానని , ఎన్నోసార్లు తమపై కేసులు పెట్టారని.. జైలుకు పంపించారని కవిత భర్త ఆవేదన వ్యక్తం చేసారు.
గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యే రేఖానాయక్తో ఎంపీపీకి విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో కవిత గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. అటు ఎమ్మెల్యే రేఖానాయక్ తీరుతో ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఖాళీ అవుతోందని కవితా గోవింద్ వెల్లడించారు.
కొన్నాళ్ల క్రితం జెడ్పీటీసీ జానకి కూడా టీఆర్ఎస్కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. కవిత సైతం బిజెపిలో చేరబోతున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టనున్నారు. భైంసా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బండి సంజయ్ సమక్షంలో కవితా కాషాయ కండువా కప్పుకోనున్నారు.