వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి హాజరుకానున్నారు. ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరు కాలేదు.
అంతకుముందు ఏడాది భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సొనారో హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇదే తొలిసారి.
ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. “ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్టు అధ్యక్షుడు హెచ్ఈ అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి 2023 జనవరి 26న గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరవుతారు” అని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.
భారత్, ఈజిప్టు దేశాలు నాగరికత ఆధారంగా సన్నిహిత ప్రజా సంబంధాలను కలిగి ఉందని ఆ ప్రకటనలో వివరించింది. గత నెల కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈజిప్టు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసిని భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.