ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు.
భారత్ జీ20 అజెండా ప్రతిష్టాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ జీ20 అధ్యక్ష స్థానాన్ని వైద్యం, సామరస్యం, ఆశల ప్రెసిడెన్సీగా మార్చేందుకు కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. మానవ- కేంద్రీకృత ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు.
స్థిరమైన జీవనశైలి, ప్రపంచ ఆహార, ఎరువులు, మందులు, ఇతర వస్తువుల సరఫరా వ్యవస్థను రాజకీయాలతో సంబంధం లేకుండా చేయడం కోసం భారత్ ఎదురుచూస్తోందని వివరించారు. భారత్ జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టినందున… ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు ప్రధాని స్పష్టిం చేశారు.
జీ20 అధ్యక్ష పదవిని భారత్ అధికారికంగా చేపట్టిన సందర్భంగా అమెరికా, ఫ్రాన్స్ దేశాలు తమ మద్దతును తెలియజేశాయి. వీటితో ప్రపంచంలోని పలు దేశాలు భారత్కు తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. భారత్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాయి.
ప్రపంచంలో అనేక రాజెకీయ సవాళ్లు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి డా. జైశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇటువంటి సమయంలో భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ స్పష్టతతో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి జీ-20 ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏడాది పాటు భారత్ జీ-20 అధ్యక్ష పదవిలో కొనసాగనుండగా.. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో పలు అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు.దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు.
ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. 2023 సెప్టెంబర్ లో జరిగే జీ20 సమావేశాలక భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ జీడీపీలోజీ 20 దేశాలు 85 శాతాం వాటాను కల్గి ఉండగా, జనాభాలో రెండింతలు ఈ జీ20 దేశాల్లోనే ఉన్నారు.