పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది.
ఈ దుర్ఘటనలో రాజ్ కుమార్‌తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం ఆ ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో బాంబు పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది.
టీఎంసీ నేతలు రాజ్‌కుమార్ మన్నా ఇంట్లో భేటీ అయిన సమయంలో దుండగులు బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ పేలుడుకు కారణంపై విచారణ జరుగుపుతున్నామని, శక్తివంతమైన బాంబు పేలడంతో ఒక మట్టి ఇల్లు పైకప్పుతో సహా కుప్పకూలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు.
కాగా, ఈ ఘటనకు టీఎంసీనే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీఫ్ ఘోష్ ఆరోపించారు. రాష్ట్రం బాంబుల తయారీ పరిశ్రమగా తయారయిందని అన్నారు. ఈ తరహా ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు. దీనిపై సీఎం ఒక ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, విపక్షాల ఆరోపణలను టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునల్ ఘోష్ తోసిపుచ్చారు. సాక్ష్యాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు.