భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లను కేంద్రం నిషేధించింది. ఇవన్నీ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
దేశ భద్రతకు సంబంధించి సున్నిత అంశాలపై అవాస్తవాలను ఈ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లలో కాశ్మీర్, ఇండియన్ ఆర్మీ, రామ మందిరం, మైనార్టీలు, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌పై ఫేక్ న్యూస్ ప్రసారం చేసినట్లు కేంద్రం తెలిపింది.
ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానళ్లలో పూంచ్ లైన్, ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్, ఖల్సా టీవీ, నేక్ డ్ ట్రూత్, 48 న్యూస్, ఫిక్షనల్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, పంజాబ్ వైరల్, నయా పాకిస్థాన్, గ్లోబల్, కవర్ స్టోరీ, గో గ్లోబల్, ఈ కామర్స్, జునైద్ హలీమ్ అఫీషియల్, తయ్యబ్ హనీఫ్, జైన్ అలీ అఫీషియల్, మోసిన్ రాజ్ పుత్, అఫీషియల్, కనీజ్ ఫాతిమా, సదాఫ్ దురానీ, మియాన్ ఇమ్రాన్, అహ్మద్, నజమ్ అల్ హసన్, బజ్వా, న్యూస్ 24 ఉన్నాయి.
వీటిలో చాలా వరకు పాకిస్థాన్ కు చెందిన నయా పాకిస్థాన్ గ్రూప్ కి చెందినవే కావడం గమనార్హం. ఈ యూట్యూబ్ ఛానళ్లన్నింటికీ కలిపి దాదాపు 35 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా.. వీడియోలకు 55 కోట్ల వ్యూస్ వచ్చాయి. పాకిస్థాన్ న్యూస్ ఛానళ్లకు చెందిన ఈ యాంకర్లే ఈ యూట్యూబ్ ఛానెళ్లలో చాలా వాటిని నిర్వహిస్తున్నారు.
వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం, పౌరసత్వ సవరణ చట్టం తదితర అంశాలపై రెచ్చగొట్టే విధంగా కంటెంట్ పోస్టు చేసి మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కేంద్రం ఐటీ రూల్స్ ప్రకారం యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంది.