గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి విజయవంతమైంది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు ఆయన కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సోమవారం ట్వీట్ చేశారు.
పాప(నాన్న) కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి మార్చారు. అక్క రోహిణి ఆచార్యతో సహా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
తండ్రిని బెడ్‌పై షిష్ట్ చేస్తున్న వీడియోను షేర్చే శారు. సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు నేడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. లాలూ కుమార్తె రోహిణి తండ్రికి కిడ్నీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, లాలూ కుమార్తె రోహిణి సింగపూర్ కు చెందిన ఓ ఐటీ నిపుణుడిని పెళ్లాడి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చి ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు. తన తండ్రి ఎందరికో ఆదర్శప్రాయుడని, ఆయన కోసం తాను చేస్తున్నది చాలా చిన్న త్యాగమని ఇటీవల రోహిణి పేర్కొన్నారు.
సింగపూర్‌లో నివసిస్తున్న రోహిణి ఆచార్య వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికి కిడ్నీ దానం చేయడానికి నిర్ణయించుకోవడం గొప్ప విషయంగా ఆర్జేడీ నేతలు, లాలూ అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ ప్రశంసిస్తున్నారు.లాలూ ప్రసాద్ యాదవ్ కోసం కూతురు రోహిణి ఆచార్య చేసిన త్యాగాన్ని భోజ్‌పూరి యాక్టర్ ఖేసరి లాల్‌యాదవ్ అభినందించారు. తండ్రికి కిడ్నీ దానం చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచిందంటూ కితాబిచ్చారు.
బీజేపీ నాయకుడు, అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ సైతం రోహిణి ఆచార్య సేవను ప్రశంసించారు. రోహిణి తన తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. లాలూజీ దేశ్‌కి నేత అని ఆయన త్వరగా కోలుకోవాలంటూ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియా ఫాలోవర్స్, ఆర్జేడీ నాయకులు రోహిణి ఆచార్య భేటీ బచావో భేటీ పడావో ప్రచారానికి ఉదాహరణగా నిలిచారంటూ ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలు తెలుపుతున్నారు.
లాలూ యాదవ్‌కు తన కిడ్నీని దానం చేసిన కుమార్తె రోహిణి ఆచార్యను బీజేపీ నేత గిరిరాజ్ ప్రశంసించడం విశేషంగా నిలిచింది. 40 ఏళ్ల వయసున్న కుమార్తె రోహిణి 74 ఏళ్ల తండ్రి లాలూకు కిడ్నీని దానం చేయడంపై ప్రశంసలు కురిపించిన గిరిరాజ్ ఇది ప్రమాదకర నిర్ణయంగా అభివర్ణించారు.
ట్విట్టర్లో ఫైర్‌బ్రాండ్ బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ రోహిణిని ప్రశంసించారు. రోహిణి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. రోహిణి లాంటి ఆదర్శవంతమైన కుమార్తె రోహిణి గురించి గర్వపడుతున్నాను అని సింగ్ ట్వీట్ చేశారు.