ఉగ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం అత్యవసరమని కేంద్రం పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని ఆడ్డుకోవడం భారత్‌తో పాటు ఇతర దేశాలకు అత్యవసరమని సూచించింది.
మంగళవారం నిర్వహించిన ”జాతీయ భద్రతా సలహాదారులు/ భద్రతా మండలి కార్యదర్శులు” ప్రారంభ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఐఎ) అజిత్ దోవల్ ప్రసంగిస్తూ.. ఈ ప్రాంతంలోని దేశాలన్నింటికీ ఆఫ్ఘనిస్థాన్ ముఖ్యమైన సమస్య అని పేర్కొన్నారు. కజికిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల నుద్దేశించి మాట్లాడారు.
శాంతియుత, భధ్రత, సుసంపన్నమైన మధ్య ఆసియా అన్ని దేశాలకు ప్రయోజనకరమని దోవల్ పేర్కొన్నారు. సంబంధిత ఉగ్రవాద నిరోధక ఒప్పందాలను పొందుపరిచిన ప్రయోజనాలను నెరవేర్చేందుకు, ఉగ్రవాదదాడులకు పాల్పడే సంస్థలకు మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యులను కోరాలని మధ్య ఆసియా దేశాలకు పిలుపునిచ్చారు.
ఈ ప్రాంతం భారత్‌కి పొరుగు ప్రాంతంగానే కాకుండా నాగరికతతో అనుసంధానించబడిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఇతర దేశాలతో సహకరించడానికి, పెట్టుబడులకు, అనుసంధానానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అనుసంధానాన్ని విస్తరించే సమయంలో కార్యక్రమాలు, సంప్రదింపులు, పారదర్శకంగా, భాగస్వామ్యతతో ఉండేలా చూడాలని కోరారు.