అన్నా హజారే 2011లో ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరుగా పేరొంది, ఢిల్లీ మహిళా కమీషన్ చైర్పర్సన్ గా మహిళా పక్షపాతిగా పేరొందినస్వాతి మలివాల్ ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో కలకలం రేగుతోంది. అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలను నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది.
కమిషన్‌లో వివిధ ఉద్యోగాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను నియమించేందుకు స్వాతి, మరికొందరు తమ పదవులను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. ఏ పరిణామమే పట్ల దిగ్బ్రాంతి చెందిన ఆమె ఏడేళ్ళ తన పదవీ కాలంలో తాను సర్వస్వం కోల్పోయానని, మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి కుటుంబ జీవితం వరకు అన్నిటినీ కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన జీవితాన్ని పెను ప్రమాదంలోకి నెట్టుకున్నానని చెబుతూ, అయితే తనకు వేలాది ఆశీర్వాదాలు లభించాయని, తాను బతికి ఉండటానికి కేవలం అదే కారణమని పేర్కొన్నారు. 22 ఏళ్ళ వయసులో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాన్ని వదులుకుని, మురికివాడల్లో స్వచ్ఛందంగా సేవలందించారు. అభివృద్ధి చేయడంలో ఢిల్లీ ఎమ్మెల్యేలకు కన్సల్టెంట్‌గా పని చేశారు. చాలా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
2015లో ఆమె డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా నియమితులైన వెనువెంటనే కమిషన్ మాజీ చీఫ్ బర్ఖా శుక్లా నుంచి ఆరోపణల వెల్లువను ఎదుర్కొన్నారు. కమిషన్‌లో ఉద్యోగాల భర్తీలో స్వాతి అవినీతికి పాల్పడినట్లు బర్ఖా ఆరోపించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేసి, స్వాతితో పాటు మరో ముగ్గురు డీసీడబ్ల్యూ సభ్యులపై ఛార్జిషీటును దాఖలు చేసింది.
కమిషన్‌లో 26 పోస్టుల భర్తీకి అనుమతి ఉందని, స్వాతి తదితరులు 87 మందిని నియమించారని ఆరోపించింది. వీరిలో అత్యధికులు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, స్వాతి మలివాల్‌కు పరిచయస్థులు అని తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ, ఈ నియామకాలు బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంతో జరిగాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో స్వాతి మలివాల్ మాట్లాడుతూ, మొదట్లో తనను డీసీడబ్ల్యూ కార్యాలయంలోకి ప్రవేశించడానికే అవకాశం ఇచ్చేవారు కాదని, వనరుల కొరత మరొక ముఖ్యమైన సమస్య అని చెప్పారు. డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ తన ఎనిమిదేళ్ళ పదవీ కాలంలో కేవలం ఒక కేసును మాత్రమే పరిశీలించారని, కానీ తాను ఇప్పటి వరకు దాదాపు 1 లక్ష కేసులను పరిశీలించానని తెలిపారు. కనీసం ఒక కేసులోనైనా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రాలేదని ఆమె స్పష్టం చేశారు.