పర్యాటకుల భద్రత, రక్షణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. అయితే, పర్యాటకులకు కల్పించాల్సిన భద్రతపై పర్యాటక మంత్రిత్వ శాఖకు పూర్తి అవగాహన ఉంది. పర్యాటకులకు సురక్షితమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
ఈ అంశంలో గతంలో పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాగాలతో చర్చలు జరిపింది. పర్యాటకులకు భద్రత మరియు రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
పర్యాటకులకు ఊహించని విధంగా అవాంఛనీయ సంఘటన జరిగిన సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి, పర్యాటకులకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించడానికి పటిష్టమైన శాంతి భద్రతల వ్యవస్థ అభివృద్ధి చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పర్యాటక శాఖ సూచించింది.
పర్యాటక మంత్రిత్వ శాఖ సూచనకు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించాయి. రంగంలోకి దిగాయి.పర్యాటకుల భద్రత, రక్షణ కోసం పోలీసు వ్యవస్థను సిద్ధం చేశాయి.
పర్యాటకులకు అవసరమైన పోలీసు యంత్రాంగం పనిచేయాల్సిన తీరు తెలుసుకుని, పర్యాటకుల అవసరాలపై పోలీస్ శాఖకు అవగాహన కల్పించి దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి అన్న అంశంపై తన అధీనంలో స్వయంప్రతిపత్త సంస్థగా పనిచేస్తున్నఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ద్వారా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.
పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ అధ్యయన నివేదిక నకలును “రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పర్యాటక పోలీసుల పని, అత్యుత్తమ అభ్యాసాల నివేదిక” పేరుతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది.
సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు విభాగాన్ని నెలకొల్పి, పర్యాటకుల అవసరాలపై వారికి అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. ఈ అంశాన్నిరాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ సహాయాన్ని కోరింది.