పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌ను కలపలాన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్ కీలకం కానుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. అందుకోసం 2జీ బయో ఇథనాల్ రిఫైనరీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ చెప్పారు.
ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థలు ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 16.19 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గడిచిన 5 సంవత్సరాలలో 385.92 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించేందుకు రెండో తరం ఇథనాల్ ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రధాన మంత్రి జేఐ-వన్ (జీవ్ ఇంధన్- వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్) యోజన పథకం కింద సెల్యూలోజిక్, లింగో సెల్యూలోజిక్ బయోమాస్ నుంచి అలాగే పెట్రో కెమికల్ మార్గం ద్వారా 2జీ ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2 జీ ఇథనాల్ బయో రిఫైనరీస్‌ను పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు వెల్లడించారు.
ఈ రిఫైనరీలకు తగిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. వరి దుబ్బు, ఇతర పంట వ్యర్థాల ఆధారిత 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలు పంజాబ్, హర్యానా, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
హర్యానాలోని పానిపట్‌లో నెలకొల్పిన బయో రిఫైనరీని జాతికి అంకితం చేసినట్లు తెలుపారు. బయోమాస్ సేకరణ కోసం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు వివిధ రాష్ట్రాలు, రైతులు, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోందని మంత్రి తెలిపారు.