“టీఆర్‌ఎ్‌సపై పోరాటం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ప్రజలతో పాటు మీ దృష్టిని కూడా మళ్లించేందుకు ఆయన (కేసీఆర్) ప్రయత్నిస్తారు. ఆయన ట్రాప్‌లో పడవద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించండి” అంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ బిజెపి నేతలకు మార్గనిర్ధేశం చేశారు. మంగళవారం వారితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారమలోకి వచ్చే విధంగా ప్రజా పోరాటాలు జరపాలని సూచించారు.
సీఎం కేసీఆర్ అవినీతికి సంబంధించిన అంశం నోటీసులో ఉందని చెబుతూ బీజేపీ నేతలను ఉరికించాలని, ఊళ్లలోకి రానీయవద్దంటూ టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనమంగళవారం పార్లమెంటు భవనంలోని అమిత్‌షా చాంబర్లో జరిగిన సమావేశంలో ఈ ప్రత్యేక భేటీ జరిపినట్లు తెలుస్తున్నది.
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడతారని, ఆ ఆటలను సాగనీయకుండా ముందుకు పోవాలని అమిత్ షా స్పష్టం చేశారు. కేసులు, నిర్బంధాలు జరుగుతూనే ఉంటాయని, వాటిని ఎదుర్కోవాలని చెబుతూ జాతీయ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాగా, ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ప్రోత్సహించాలని, దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్‌లలో ఎలా కష్టపడి గెలిచారో.. అదే పట్టుదలను కొనసాగించాలని అమిత్ షా సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఉద్యోగ సంఘం నేత విఠల్ వివరించి, దీనిపై సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 27న దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలుపగా, అలాంటి పోరాటాలు చేస్తూనే ఉండాలని అమిత్ షా సూచించారు.
రాష్ట్రంలో ఒకరోజు బహిరంగసభ నిర్వహించాలన్న ప్రతిపాదన రాగా.. ఈ సభను సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో ఏర్పాటుకు అవకాశమివ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోరారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ ఐనా బాగుంటుందని కిషన్‌రెడ్డి పేర్కొనగా.. పార్లమెంటు సమావేశాల తర్వాత తాను తేదీ చెబుతానని, ఆ షెడ్యూలును సిద్ధం చేయాలని నేతలకు అమిత్ షా సూచించినట్లు సమాచారం.
రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారుల వైఖరి అతిగా ఉందని పార్టీ నేతలు అమిత్‌షాకు వివరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనెత్తుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశాయని, అలాగే, రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు సంజయ్ నల్లగొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన సందర్భంలో పోలీసులు, టీఆర్ఎస్ నేతల దాడులను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్‌ను అమిత్‌షా ప్రత్యేకంగా అభినందించారు.సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై బాగా పోరాడుతున్నారని అంటూ బండి సంజయ్ ను ప్రశంసించారు.
సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు అర్వింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం. రఘునందన్‌రావు, సీనియర్ నేతలు గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు అరగంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి అమిత్ షాకు వారు వివరించారు.
కాగా, కేసీఆర్ నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలనపై తాము పోరాటం చేస్తున్న తీరును అమిత్ షా అభినందించారని భేటీ అనంతరం బండి సంజయ్ తెలిపారు. ఇదే పోరాట పంథాను కొనసాగించాలని సూచించారని చెప్పారు.
తన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత వెంటనే ప్రారంభించాలని సూచించారని, రెండు రోజుల పాటు యాత్రలో పాల్గ్గొంటానని అమిత్ షా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని, ఆయన ఒక దుర్మార్గుడని సంజయ్ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తున్నదని ప్రశ్నించారు. ప్రతీ గింజ కొంటామని చెప్పి రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు.