జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో భారీ ఆయుధాల డంప్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పాకిస్థాన్, చైనాలో తయారైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకొన్నట్లు ఆర్మీ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ చంద్రపురియా వెల్లడించారు.
వీటిలో ఎనిమిది ఏకే-74 రైఫిళ్లు, 24 ఏకే-74 రైఫిల్ మ్యాగిజైన్లు, 7.62 ఎంఎం ఏకే-74 లైవ్ అమ్యూనిషన్లు 560, 12.30 ఎంఎం చైనీస్ పిస్టల్స్, 24 చైనా పిస్టల్స్ మ్యాగజైన్స్, భారీ మందుగుండు సామగ్రి, పాకిస్థాన్.. చైనాలలో తయారైన హ్యాండ్ గ్రనేడ్లు, ‘ఐ లవ్ పాకిస్థాన్’ అని రాసిన 81 బెలూన్లు ఉన్నట్లు వివరించారు.
ఇటీవల కాలంలో కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధాల చేరవేత భారీగా తగ్గిన వేళ లోయలో ఎలాగైనా అలజడి సృష్టించే ప్రయత్నం పాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నట్టు అజయ్ చంద్రపురియా తెలిపారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఎల్వోసీ వద్ద తమ దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి వీటిని గుర్తించాయని తెలిపారు.
ఉరీ రామ్‌పూర్ సెక్టార్‌లోని హథ్లాంగా ప్రాంతంలో భారీగా ఆయుధాలను దాచిపెట్టిన ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్టు రెండు వారాల కిందట నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయని చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టగా.. 8 గంటల అనంతరం ఈ ఆయుధాల డంప్ బయటపడిందని మేజర్ జనరల్ తెలిపారు.
‘‘ప్రస్తుతం కశ్మీర్ లోయ అంతటా పరిస్థితి సాధారణంగా ఉందని, ఉగ్రవాదులు, ఆయుధాల అక్రమ చొరబాటు బాగా తగ్గింది.. కాబట్టి, ఉగ్రవాదుల చొరబాటు లేదా యుద్ధం లాంటి ఆయుధాలను అక్రమంగా తరలించడానికి అవతలి వైపు (పాక్) నుంచి చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో వారు భారీ నిరాశలో ఉన్నారు’’ అని అజయ్ చంద్రపురియా వివరించారు.