ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్‌లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తు బృందం సుశాంత్‌ది ప్రాథమికంగా ‘ఆత్మహత్య’గా నిర్దారించగా.. సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే అని కుటుంబం ఆరోపించింది.
ఈ కేసును ముందుగా ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా, అటు నుంచి కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేశారు. సుశాంత్ సింగ్ మరణించి రెండేళ్లు దాటిపోతున్నా, అతడి మరణం మిస్టరీగానే ఉండిపోయింది. అటు ముంబై పోలీసులు కానీ.. ఇటు సీఐడీ బృందం కానీ ఈ కేసును ఎటూ తేల్చలేక పోయారు.
అయితే, సుశాంత్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన రూప్‌కుమార్ షా (అటాప్సీ టీం మెంబర్) చేసిన కామెంట్స్ ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రూప్‌కుమార్ షా మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య గావించబడ్డాడని చెప్పాడు. సుశాంత్ దేహం, మెడపై పలు గాయాలున్నట్టు గుర్తించానని వెల్లడించాయిడు.
“సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినపుడు కూపర్ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం కోసం ఐదు మృతదేహాలు వచ్చాయి. ఈ ఐదింటిలో ఒకటి వీఐపీ బాడీ. మేం పోస్ట్‌మార్టం చేసేందుకు వెళ్లినపుడు సుశాంత్ శరీరంపై కొన్ని గుర్తులుండగా, మెడపై కూడా రెండు మూడు గుర్తులు కనిపించాయి” అని తెలిపాడు.
ఆ గుర్తులను నమోదు చేయవలసి ఉన్నప్పటికీ, ఉన్నతాధికారులు మాత్రం కేవలం మృతదేహం ఫొటోలు మాత్రమే తీయాలనాదంతో వారి ఆదేశాల మేరకు అలాగే చేశామని వెల్లడించాడు.
“నేను ఉన్నతాధికారులకు సుశాంత్ సింగ్‌ది హత్య అని కూడా చెప్పాను. నిబంధనల ప్రకారం పనిచేయాలని వారిని అడిగాను. సుశాంత్ మృతదేహం చూసిన మొదటిసారి వెంటనే ఇది ఆత్మహత్య కాదు హత్య అని నా సీనియర్లకు చెప్పా. మనం రూల్స్ ప్రకారం పనిచేయాలని కూడా చెప్పా” అని పేర్కొన్నాడు. “కానీ వీలైనంత త్వరగా మృతదేహం ఫొటోలు తీసి పోలీసులకు అప్పగించాలని నాకు చెప్పారు. అందుకే కేవలం రాత్రి శవపరీక్ష చేసాము” అని చెప్పుకొచ్చాడు.