కర్ణాటక బిజెపి రాజకీయాలలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి ఆ పార్టీని వదిలి పెట్టి, సొంతంగా కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఒక విధంగా మరో ఐదు నెలల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విధంగా మరోసారి బిజెపి అధికారంలోకి రావడానికి దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గనుల కుంభకోణంలో జైలుపాలై, పలు కేసులలో నిందితుడిగా ఉంటూ, పుష్కరకాలం పాటు ఒక విధంగా రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టడం కేసుల నుండి తనను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదుకోలేదనే అక్కసుతోనే అని స్పష్టం అవుతుంది. కర్ణాటక ఎన్నికలలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో నా అనుకున్న వారే తనను మోసం చేశారని, కష్టకాలంలో ఎవరూ తనకు అండగా నిలబడలేదని ఆయన చెప్పడం గమనార్హం. దానితో గాలి జనార్ధనరెడ్డి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ప్రతుత్వ వ్యతిరేక ఓట్లలో చీలికకు దారితీసి, కొద్దో గొప్పో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత నుండి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ఎన్నికలలో బైటపడి అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక బీజేపీ రాజకీయాలు అటుంచితే, బిఆర్ఎస్ ను ప్రకటించిన తర్వాత మొదటగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వేసుకున్న పధకాలు గాలి నిర్ణయంతో తలకిందులయ్యే అవకాశాలు కూడా స్పష్టం అవుతున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా జేడీఎస్ ను గెలిపిద్దామని తాజాగా పార్టీ సమావేశంలో కేసీఆర్ పిలుపివ్వడం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లొ పోటీ చేస్తామని కూడా ప్రకటించారు.
ఇప్పుడు గాలి జనార్ధన రెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ కూడా కేసీఆర్ దృష్టి సారిస్తున్న ప్రాంతాలపైననే కేసీఆర్ సహితం కేంద్రీకరించే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం కావటంతో పాటుగా.. తెలుగు రాష్ట్రాలతో సంబంధాలు కలిగిన వారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు.
దీనితో గాలి, కేసీఆర్ పార్టీలు ముఖాముఖి తలపెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడి బిజెపి మరింతగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వీరి రెండు పార్టీలకు కూడా దీంతో, ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ బీఆర్ఎస్ అంచనాలను దెబ్బ తీస్తుందా?. లేక, బీఆర్ఎస్ ఆ పార్టీకి చెక్ పెడుతుందా? ఈ రెండు పార్టీలు ఎవరి ఓట్ బ్యాంక్ పైన ప్రభావం చూపుతాయో చూడవలసి ఉంది.
హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం ఇప్పుడు కల్యాణ కర్ణాటకగా మారింది. కల్యాణ కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబురగి(గుల్బర్గా) కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో 48 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పుడు గాలి జనార్ధన రెడ్డి ఈ ప్రాంతం కేంద్రంగానే వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.
కొప్పల్ జిల్లాలోని గంగవతి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు గాలి జనార్ధన రెడ్డి ప్రకటించారు. ఒక విధంగా గాలి పార్టీ పెట్టడం కేసీఆర్ కర్ణాటక ప్రవేశానికి చెక్ పెట్టిన్నట్లే కాగలదు. బీఆర్ఎస్ – గాలి కొత్త పార్టీ రెండూ దాదాపుగా ఒకే ప్రాంతం పైన ప్రధానంగా ఆధారపడబోవడమే అందుకు కారణం.