తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ హెచ్చరించారు.
ఈ కేసు నమోదు తర్వాత మొదటిసారి బీజేపీ దక్షిణాది రాష్ట్రాల విస్తారక్ల సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ కు వచ్చిన ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానని తెలిపారు. తాను ఎవరో తెలియకపోయినా తన పేరు మాత్రం ఇంటింటికి వెళ్లిందని, తెలంగాణలో తన పేరు పాపులర్ అయిపోయిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ తల్లి పేరుతో గెలిచి.. ఆ తల్లి రొమ్మును గుద్దారంటూ బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో దుర్మార్గపు పానలను పారద్రొలాలంటూ కార్యకర్తలకు సంతోష్ పిలుపునిచ్చారు. ఇక్కడున్న నాయకులు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి శాపమని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. సిట్ నోటీసులపై సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్ చేయరాదని సిట్ కు హైకోర్టు నిర్దేశించింది. సంతోష్‌కు సిట్ జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.
ఈ లోగా, ‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో(నంబరు 63)ను కొట్టేయడంతో కేసీఆర్ ప్రభుత్వంకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది.