బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు (88) కన్నుమూశారు. కొంతకాలం కిందట అస్వస్థతకు గురై నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. భౌతికకాయాన్ని పిఠాపురం కాలనీలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు.
సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చలపతిరావుకు భార్య అనురాధ (రిటైర్డ్ లైబ్రేరియన్), కుమార్తెలు అంజనా ఉపాధ్యాయ, అపర్ణా ముఖర్జీ, కుమారుడు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఉన్నారు. చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా 1980, 1985ల్లో రెండు పర్యాయాలు పనిచేశారు.
1974, 1984లలోనూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.
పీవీ చలపతిరావు ఆకస్మిక మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి చలపతిరావు తనకు మార్గదర్శకులుగా నిలిచారని.. ఆయన మరణం తీరని లోటని సోము ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయం అని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో ఆనాటి జనసంఘ్ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల్లో ఆయన ఒకరని తెలిపారు.