జార్ఖాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జైనులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారంనాడు నిరసనలకు దిగారు. ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక కేంద్రమైన ‘శ్రీ సమ్మేద్ శిఖర్జీ’ను పర్యాటక కేంద్రంగా జార్ఖాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
దీనిపై జైన మతస్తులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేలాది మంది జైనులు బ్యానర్లు పట్టుకుని నిరనసలకు దిగారు. శ్రీ సమ్మేద్ శిఖర్జీని పర్యాటక కేంద్రంగా మార్చరాదంటూ డిమాండ్ చేశారు. జైనుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలుసుకుంది.
అటు సౌత్ ముంబైలోనూ నిరసనలు పెల్లుబికాయి. విపి రోడ్డు నుంచి నుంచి క్రాంతి మైదాన్ వరకూ జైనులు నిరసన మార్చ్ నిర్వహించారు. విపి రోడ్డు, బోరివలి, ఘట్కోపార్, భయండెర్, డోంబేవలి, భివాండి, గుల్వాడిలో సైతం నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ముంబైలోని భులేశ్వర్ జైన్ ఆలయం వద్ద జైన ప్రముఖులు, ఆ కమ్యూనిటీ కి చెందిన ఆఫీస్ బేరర్లు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు జనవరి 4న లక్ష మందితో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. కాగా, జార్ఖాండ్ ప్రభుత్వ నిర్ణయంపై అహ్మదాబాద్‌లోనూ జైనులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.