బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ఏపీ శాఖకు అధ్యక్షుడిని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు తెలంగాణలో అధ్యక్షుడు లేడు కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు అధ్యక్షుడిని ప్రకటించారంటూ ఎద్దేవా చేశారు.
అసలు బిఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి.. ఆంధ్రావాళ్లను తిట్టారని సంజయ్ గుర్తుచేశారు. ఆంధ్రా బిర్యానీని పెండ బిర్యానీ అని తిట్టి.. ఇప్పుడు ఏపీ నేతలకు పిలిపించుకుని చేర్చుకొంటున్నారని దుయ్యబట్టారు.
పోలవరం మీద కేసీఆర్ స్టాండ్ ఎంటో తెలపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణలో ఆర్టీసీని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. అటు విద్యుత్ ఛార్జీలను కూడా పెంచారంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఏం ఉద్దరించారని ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు.
సీఎం కేసీఆర్ ఇంకా అప్డేట్ కాలేదని.. ఇంకా ఆయన మైండ్ 2014 సంవత్సరంలోనే ఉందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో 100కు పైగా దేశాలకు భారత్ వ్యాక్సిన్ అందిస్తోందని, ఆయుధాలను తయారు చేసి ఇతర దేశాలను ఎగుమతి చేస్తున్న దేశం భారత్ అని వివరించారు.
మొన్ననే ఆరు వేల కోట్లతో రామగుండం ఎరువురు ఫ్యాక్టరీని ప్రారంభించుకున్నామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కేసీఆర్ పెద్ద కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు వేస్తే.. యువత అంతా కోచింగ్ సెంటర్లకు పంపించేలా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.