పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ కోసం రూ. 19,744 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. కర్బన ఉద్గారాలను తగ్గించి, గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పొందడం ఈ మిషన్ ప్రత్యేకత.
దేశంలో శిలాజ ఇంధన (పెట్రోల్, డీజిల్) వినియోగం తగ్గించి, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని.. ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలపడమే లక్ష్యంగా రూపొందించిన హైడ్రోజన్ మిషన్ కోసం కేంద్రం రూ.19,744 కోట్లు కేటాయించిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందులో రూ. 17,490 కోట్లు సైట్ ప్రోగ్రామ్ కోసమే కేటాయించనున్నట్లు వెల్లడించారు
పైలట్ ప్రాజెక్టుల కోసం రూ. 1446 కోట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు రూ. 400 కోట్లు, ఈ మిషన్‌కు సంబంధించి ఇతర విభాగాల కోసం రూ. 388 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి మార్గదర్శకాలను సంబంధిత మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేస్తుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రయోజనాలు:
★ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది.
★ ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా.
★ 2030 నాటికి లక్ష కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గిపోతాయని, 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చని మోదీ సర్కార్ భావిస్తోంది.
★ 2030 నాటికి 125 గిగా వాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్ లక్ష్యం. ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
★ ఈ మిషన్ ద్వారా ఉత్పత్తి చేసే ‘కార్బన్ రహిత హైడ్రోజన్’ను ఆటోమొబైల్ వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. చమురు శుద్ధి కర్మాగారాలు, ఉక్కు కర్మాగారాలు లాంటి పరిశ్రమల్లోనూ ఇది ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది.
★ రసాయన ప్రక్రియలో నీటిని విభజించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. సూర్యుని లాంటి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఉపయోగించి విద్యుద్విశ్లేషణ ద్వారా నీటిని విభజించినప్పుడు ‘గ్రీన్ హైడ్రోజన్’ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ‘ఆక్సిజన్’ వస్తుంది.