తెలగాంణలో ఆర్థిక సంక్షోభం నెలకొనే పరిస్థితి ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముతోందని, కేంద్రం నిదులను ఇతర పథకాలకు దారి మళ్లిస్తోందని ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును కేంద్రమే ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చిందన్న బీఆర్ఎస్ నేతల వాదనను ఆయన ఖండించారు. అవినీతిపై దర్యాప్తు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడడం కాకతాళీయమేనని చెప్పారు. కేసీఆర్.. బీఆర్ఎస్ కాదు డబ్ల్యూఆర్ఎస్ (ప్రపంచ రాష్ట్ర సమితి) పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు.
ఇటీవల కేంద్రం నుంచి పంచాయతీలకు రూ.5080 కోట్లు విడుదల చేేస్త డిజిటల్ కీల ద్వారా గంటల్లోనే ఆ నిధులను దారి మళ్లించారని కేంద్ర మంత్రి విమర్శించారు. అయితే ‘గద్దలా కాచుకొని ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. ఫండ్స్ వచ్చిన గంటలోపే దారి మళ్లించింది. ఇంతకు మించి దౌర్భాగ్యపు పరిస్థితి మరోటి ఉండదు’ అని మండిపడ్డారు. డిజిటల్ కీ దుర్వినియోగం చేసి సర్పంచ్‌లకు తెలియకుండ, పంచాయతీ ఆమోదం లేకుండా రాష్ట్ర సర్కార్ నిధుల్ని డ్రా చేసిందని ఆరోపించారు.
అలాగే ఉపాధి హామీ స్కీం నిధుల్ని కూడా తెలంగాణ సర్కార్ పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. గ్రామీణ పేదల ఉపాధి కోసం పెట్టిన ఈ స్కీంను పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మేలు చేసేలా బీఆర్ఎస్ పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిధులు దారి మళ్లాయని సర్పంచ్ లు నిరసన తెలపాలంటే హైకోర్టు నుంచి అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. చివరకు పాదయాత్ర, ధర్నాలు, ఊరేగింపులు, మీటింగ్ కోసం న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తుందంటే.. రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏరకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
తెలంగాణలో ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించేందుకు 2021-22, 2022-23 సంవత్సరాలకు గాను కేంద్రం రూ.114 కోట్లు విడుదల చేసిందని చెబుతూ సంబంధిత పత్రాలను మీడియాకు విడుదల చేశారు. “పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక వ్యాట్ తెలంగాణలోనే ఉంది. కేంద్రం పిలుపు మేరకు 23 రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించినా.. తెలంగాణ స్పందించలేదు. ఉత్తరప్రదేశ్, అస్సోం కన్నా రూ.13ఎక్కువగా రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్నారు’’ అని గుర్తు చేశారు. ల్యాండ్, లిక్కర్, బొగ్గు, సున్నపురాయి, ఇసుక మాఫియాతో తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతూ అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ ఉనికి తగ్గిపోతోందని తెలిపారు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు తెలంగాణలో మాఫియా, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనే కనిపిస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తండ్రి–కొడుకులు, మామ–అల్లుండ్ల, తండ్రి– కూతుళ్ల, మజ్లిస్–బీఆర్ఎస్ పాలన సాగుతుందని ఫైర్ అయ్యారు.
చేరికలపై ఎమ్మెల్యేలతో స్వామిజీలతో మాట్లాడించాల్సిన దుస్థితి బీజేపి కి లేదన్నారు. కేంద్ర మంత్రిగా తానే నేరుగా బీజేపీలో చేరాలనుకున్న వారితో మాట్లాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న ముగ్గురు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే అని చెప్పారు. అలాంటివారు కల్వకుంట్ల జాతి రత్నాలు ఎలా అయ్యారని ప్రశ్నించారు.
కాగా, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిరికి మనిషి అని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయరని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తల కిందికి, కాళ్లు మీదికి చేసినా కేసీఆర్ గెలవలేరని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఒక వేళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఆ తెల్లవారే రాష్ట్రపతి పాలన వస్తుందని పేర్కొన్నారు.