గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దక్షిణాది సినిమాల ఆధిపత్యం కొనసాగింది. దక్షిణాది సినిమాల దెబ్బకు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. దక్షిణాది నుండి సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు కనీసం రెండు, మూడు వారాలు గ్యాప్ తీసుకుని రిలీజ్ అయ్యేంత వరకు వెళ్ళింది. దానితో హిందీ పరిశ్రమలో ఇప్పుడు అదే సౌత్ సినిమాలకు నీరాజనం పలుకుతుంది.
గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలుకొని, ‘కేజీఎఫ్’, ‘కార్తికేయ’, ‘కాంతార’ వంటి పలు సౌత్ సినిమాలు హిందీ సినిమాలతో పోటీ పడి మరీ అక్కడ విజయం సాధించాయి. నిజానికి పుష్ప సినిమా నుండే హిందీలో సౌత్ సినిమాల హవా కొనసాగింది.
కాగా తాజాగా దక్షిణాది సినిమాలు ఉత్తరాది టెలివిజన్‌లో కూడా సత్తా చాటుతున్నాయి. తాజాగా విడుదలైన టాప్ టీవీ ప్రీమియర్ రేటింగ్స్లలో దక్షిణాది డబ్బింగ్ సినిమాల హవా కొనసాగింది. లేటెస్ట్గా రిలీజైన ఈ జాబితా టాప్-5లో మొదటి మూడు స్థానాలు దక్షిణాది సినిమాలే ఆక్రమించాయి.
మొదటి స్థానంలో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఉండగా, రెండో స్థానంలో క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ ‘పుష్ప’ ఉంది. ఇక మూడో స్థానంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్-2’ ఉన్నాయి. ఇలా వరుసగా మూడు స్థానాల్లో దక్షిణాది సినిమాలుండటం గతంలో ఎన్నడూ జరగలేదు.
ఆ తర్వాతి స్థానాల్లో ‘సూర్యవంశీ’, ‘భూల్ భూలయ్య-2’ హిందీ సినిమాలున్నాయి. టాప్ 10లో ‘కార్తికేయ’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు చోటు సంపాదించుకున్నాయి. బిగ్ స్క్రీన్లోనే కాదు స్మాల్ స్క్రీన్‌లోనూ దక్షిణాది సినిమాలు నార్త్‌లో విజయ ఢంకా మోగించాయి.