కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తే ఆయా నిధులను తస్కరించిన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రి, అధికారులపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, కంపా నిధులు సహా కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ అభివ్రుద్ధికి పెద్ద ఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న కేసీఆర్ తెలంగాణను ఏ విధంగా అభివ్రుద్ధి చేస్తారని ప్రశ్నించారు.
ఈ విషయంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే పదేపదే కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం లేదనే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయిరు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణకు కేంద్రం ఏయే పథకానికి ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు.
ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారంసాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రిపరేటరీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివ్రుద్ధి ఏమీ లేదు. అందుకే ప్రధానిని, కేంద్రాన్ని తిడుతూ చర్చను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రిని ఏనాడూ అభివ్రుద్ధి గురించి, నిధుల గురించి అడగని కేసీఆర్… ఇయాళ కేంద్రాన్ని బదనాం చేసేందుకు అబద్దాలు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాన్ని కాపాడుకోవడానికి, పేరు ప్రతిష్టల కోసమే తప్ప తెలంగాణ అభివ్రుద్ధి గురించి, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
8 నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెబుతూ మనం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సంజయ్ చెప్పారు. బెంగాల్ మాదిరిగా బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నడని ఆరోపించారు. అయితే, రజాకార్ల రాజ్యం పోవాలె… రామరాజ్యం రావాలనే భావనతో ప్రజలున్నరని భరోసా వ్యక్తం చేశారు.