ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవి గంగా విలాస్’ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. భారత్‌లో కొత్త తరం పర్యాటకానికి ఇది నాంది పలుకనుంది. కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. దీని స్ఫూర్తితో దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని ప్రధాని తెలిపారు.
“ప్రపంచ రివర్ క్రూయిజ్ చరిత్రలో ఇదొక మర్చిపోలేని రోజు! అతి పొడవైన క్రూయిజ్‌లో.. అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం ప్రారంభమైంది. యూపీ, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్‌లో ప్రయాణించి.. చివరికి అసోంలోని డిబ్రూగఢ్‌కు చేరుకుంటుంది. ఈ ప్రయాణంతో టూరిజంతో పాటు ట్రేడింగ్ అవకాశాలు కూడా పెరుగుతాయి” అని ప్రధాని తెలిపారు.
ఇన్లాండ్ వాటర్‌వేస్ అభివృద్ధిని భారత్ ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో ఈ గంగా విలాస్ చెబుతుందని చెప్పారు. గంగా విలాస్‌లో ఉన్న ప్రయాణికులకు ఒక విషయం చెబుతున్నా అంటూ భారత్ అనేది మీ అంచనాలకు మించి ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. భారత్ ను మాటల్లో వర్ణించలేరని, హృదయం లోతుల్లో నుంచి అనుభూతి చెందాలని సూచించారు.
అంతకుముందు.. వారణాసిలో ‘టెంట్ సిటీ’ని కూడా ప్రారంభించారు ప్రధాని మోదీ. టెంట్ సిటీ పేరుతో వారణాసిలో 200కుపైగా టెంట్లు ఏర్పాటు చేశారు. పవిత్రమైన నగరంలోని వివిధ ఘాట్లను తిలకించే విధంగా ఈ టెంట్లను రూపొందించారు. లైవ్ క్లాసికల్ మ్యూజిక్, సాయంత్రం వేళ నిత్యం జరిగే హారతి కార్యక్రమాలు, యోగా క్లాస్‌లను ఈ టెంట్ సిటీ నుంచి వీక్షించవచ్చు.
అదే సమయంలో.. రూ. 1000కోట్లతో కూడిన పలు ఇన్లాండ్ వాటర్‌వేస్ ప్రాజెక్టులను సైతం ప్రధాని మోదీ ప్రారంభించారు .
భారత్‌లో తయారైన తొలి నౌక గంగా విలాస్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు మొదటి ప్రయాణం చేయనున్నారు. వారణాసి నుంచి దిబ్రూగఢ్ వరకు ఈ ప్రయాణం ఉంటుంది.
ప్రయాణం మధ్యలో బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ నౌక పయనిస్తుంది. భారత, బంగ్లాదేశ్‌లలో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణం మార్గంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు వీక్షించొచ్చు. ఈ నౌకలో 36 మంది పర్యాటకులు ప్రయాణించొచ్చు. 51 రోజుల పాటు 3200 కిమీ. వరకు ఈ నౌక ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఒక్కొక్కరికి రోజుకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చవుతుంది. 51 రోజుల ట్రిప్‌లో ఒక్కొక్కరికి సుమారు రూ. 20 లక్షలు ఖర్చు కానుందని క్రూజ్ నిర్వాహకులు తెలిపారు.