ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ శనివారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో, ఆఫీస్ లో మరోసారి సోదాలు జరిపింది. కాగా గతంలో కూడా మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సిబిఐ ఇదే కేసులో సోదాలు జరిపింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రధాన కార్యాలయంలో తొమ్మిది గంటలపాటు కూడా విచారించారు.
ఈ కేసు కేవలం ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, తనను గుజరాత్ ఎన్నికల పాల్గొనకుండా అరెస్ట్ చేసేందుకే అని అంటూ ఆరోపించారు. ఆప్ ను వదిలి బీజేపీలో చేరాలని తనపై సిబిఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని, పార్టీ మారితో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారని సిసోడియా ఆరోపించారు.
ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం అమిత్ బడ్జీ ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. ఇక సీబీఐ, ఈడీ ఎఫ్ఐఆర్ లలో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. ఈ కుంభకోణంపై గత ఏడాది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడంతో సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. సిసోడియాతో సహా పలువురిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
కాగా, గతంలో జరిగిన సోదాలతోపాటు తాజా సోదాల్లోనూ తనకు వ్యతిరేకంగా సీబీఐకి ఎలాంటి ఆధారాలు లభించలేదని సిసోడియా తెలిపారు. ‘సీబీఐ అధికారులకు గత సోదాల్లో వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. తాజా సోదాల్లోనూ వారికి ఏమీ లభించవు’ అని ఆయన ట్వీట్ చేశారు.
మరోవంక, సిసోడియా ఆఫీసులో సోదాల విషయాన్ని దర్యాప్తు సంస్థ ఖండించింది. సిసోడియా కార్యాలయంతో ఎలాంటి తనిఖీలు చేయలేదని సీబీఐ ప్రకటించింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా కొన్ని డాక్యుమెంట్ల కోసం సీబీఐ అధికారులు డిప్యూటీ సీఎం ఆఫీసుకు వెళ్లారని, సోదాలు నిర్వహించలేదని సమాచారం.