కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం మాట్లాడుతూ ‘నేనూ మధ్యతరగతి కుటుంబానికి చెందినదానినే. మధ్యతరగతి ప్రజల కష్టాలు నాకు బాగా తెలుసు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యతరగతి మీద ఎలాంటి కొత్త పన్నులు వేయలేదు’ అని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 1న ఆమె 2023-24 యూనియన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిధిని పెంచి మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.‘నేనూ మధ్య తరగతి వర్గానికి చెందిన దానినే. మధ్య తరగతి ప్రజలపై ఉన్న ఒత్తిడి గురించి నాకు తెలుసు’ అని ఆమె జాతీయ వారపత్రిక ‘పాంచజన్య’ మ్యాగజైన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు.
పైగా, మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదని ఆమె చెప్పారు. ఆదాయపు పన్ను పరిధి రూ. 5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. 27 నగరాలలో మెట్రో రైలు నెట్వర్క్ అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టిందని, ప్రజలు సౌఖ్యంగా జీవించేందుకు 100 స్మార్ట్ సిటీలను నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరిగినందున వారికి ప్రభుత్వం మరిన్ని మేలులు చేయగలదని ఆమె హామీ ఇచ్చారు. ‘మధ్య తరగతి ప్రజల సమస్యలు నాకు తెలుసు. ప్రభుత్వం వారికి మంచి చేస్తున్నది. మరింత చేయనున్నది’ అని తెలిపారు.
2020 నుంచి ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో మూలధన వ్యయం వాటాను పెంచుతోందని చెప్పారు. బ్యాంకింగ్ రంగం గురించి మాట్లాడుతూ ‘నాన్ పర్ఫామింగ్ అసెట్స్’ తగ్గిపోయాయని, ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు చాలా వరకు మెరుగుపడిందని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌తో వాణిజ్యం గురించి మాట్లాడుతూ ‘ ఆ దేశం ఎప్పుడు భారత్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఇవ్వలేదు. 2019లో పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలు బాగా క్షీణించాయి’ అని పేర్కొన్నారు. ఉచితాల(ఫ్రీబీస్)పై మాట్లాడుతూ ఆర్థిక స్థితిపై దృష్టి పెట్టాకే వాటి గురించి పరిశీలిస్తామని, అంతా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.