ఢిల్లీలో వాయు కాలుష్యంపై వినూత్నంగా నిరసన తెలుపుతూ బీజేపీ ఎమ్మెల్యేలు మాస్కులు ధరించి ఆక్సిజన్ సిలిండర్లతో ఢిల్లీ అసెంబ్లీకి వచ్చారు. విషపూరిత గాలికి ప్రజలు చనిపోతున్నా సీఎం కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు.
”గ్యాస్ ఛాంబర్లో బతుకు భయంతో కాలం గడుపుతున్న రెండు కోట్ల మంది ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించబోతున్నాను. కాలుష్య రహిత రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలోమిటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి” అని విపక్ష నేత విజేందర్ గుప్తా ఒక ట్వీట్లో తెలిపారు. ఢిల్లీని పొగ చుట్టుముట్టిందని, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ జబ్బుల బారిన పడుతున్నారని, చేతకాని ఆప్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోందని ఆయన విమర్శించారు.
సిలెండర్లు తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలను స్పీకర్ నివాస్ గోయెల్ మందలించారు. సిలెండర్లు దూరంగా పెట్టి రావాలన్నారు. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లున్నప్పటికీ సిలెండర్లను ఎలా తీసుకువచ్చారని వారిని ప్రశ్నించారు. సెక్యూరిటీ సిబ్బంది తన ఛాంబర్‌కు వచ్చి కలవాలని కూడా ఆయన ఆదేశించారు. కాగా, శీతాకాల సమావేశాలు మూడు రోజులే జరుగనున్నాయి. ఈ సెషన్లో ప్రశ్నోత్తరాలను తొలగించారు.
ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వాడీవేడీగా సభ సాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. సభ్యుల ఆందోలన మధ్య సభకు రెండుసార్లు అంతరాయం కలిగింది. చివరకు సభ మరుసటి రోజుకు వాయిదా పడింది.
శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు ఎల్జీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యోగా తరగతులను రద్దు చేశారని, ఉపాధ్యాయులను శిక్షణకు ఫిన్లాండ్ పంపడంలో తాత్సారం చేశారని సీఎం కేజ్రీవాల్ ఎల్జీ సక్సేనాపై ఆరోపణలు చేశారు.
అలాగే, మొహల్లా క్లినక్లతో తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో వాటిని నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్జీ రాజ్యాంగాన్ని ఏమాత్రం ఫాలో కావడం లేదని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎల్జీ కొట్టిపారేశారు. ఆప్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.
ఆప్-బీజేపీ మధ్య ఆరోపణలు – ప్రత్యారోపణల మధ్య సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి 11 గంటలకు సమావేశం కాగానే, ఎల్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆప్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. దాంతో సభ మరోసారి 10 నిమిషాలపాటు వాయిదా పడింది. తిరిగి సభ మొదలవగానే బీజేపీ సభ్యులు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చారు. దాంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.