గరీబ్ హఠావో అనేది కాంగ్రెస్ పార్టీకి ఓ నినాదం మాత్రమేనని, నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు భవిష్యత్తు కోసం చేసిందేమీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధదండగని, దేశ ప్రగతిని నాశనం చేసిందని, ప్రజల డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా గురువారం రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగీస్తూ దేశ ప్రజలు కాంగ్రెస్‌ను నిరాకరిస్తున్నారని స్పష్టం చేశారు. అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని ఆందోళన చేపడుతున్న ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పటికీ ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు.
చిన్న చిన్న దేశాలు సహితం అభివృద్ధి చెందితే, భారత్‌ను కాంగ్రెస్ నాశనం చేసిందని ప్రధాని విమర్శించారు. యుపిఎ పనితీరును నిశితంగా పరిశీలించానని చెబుతూ ఆ ప్రభుత్వం ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా యత్నించలేదని పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యలకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని స్పష్టం చేశారు.
దేశ అభివృద్ది కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొంటూ పార్లమెంటులో జరిగే ప్రతి అంశాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. కొందరు ఎంపిలు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, వారి తీరు బాధ కలిగిస్తోందని తెలిపారు. గడిచిన 3-4ఏళ్లలో దేశవ్యాప్తంగా 11 కోట్ల నివాసాలకు మంచినీటి కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు.
గడిచిన 9 ఏళ్లలో 48 కోట్ల జన్‌ధన్ ఖాతాలను ప్రారంభించామని పేర్కొంటూ తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎంత బురద జల్లినా కమలం అంతగా వికసిస్తుందని, అందుకు ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
నెహ్రూ పేరును దాదాపు 600 ప్రభుత్వ పథకాలకు పెట్టారని చెబుతూ తమ ప్రభుత్వం నెహ్రూ పేరును ఏ పథకానికైనా పెట్టకపోతే, రచ్చ చేస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ ఇంటిపేరుగా నెహ్రూను ఉపయోగించరని తెలిపారు.. సొంత తాత అయిన నెహ్రూ ఇంటి పేరు ఉపయోగించడానికి వారెందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ అధిష్టానంలో భాగమైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని పేర్కొంటూ రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడానికి ఆమె ఆర్టికల్ 356 ను 50 సార్లు ఉపయోగించిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మాత్రం సహకార, పోటీదాయక సమాఖ్య విధానాన్ని అవలంబిస్తోందని వివరించారు. విపక్షాలు విసురుతున్న బురదలోనే కమలం వికసిస్తుందని స్పష్టం చేశారు.