రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషమని ఆమె చెప్పారు.
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అన్న ఆమె ఈ యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం ఆనందం కలిగించిదని తెలిపారు. పేదల కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. దేశానికి, కాంగ్రెస్ కు 2024 ఎన్నికలు పరీక్షలాంటివని తెలిపారు. యూపీఏ పాలన తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని సోనియా గాంధీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని ఆమె చెప్పారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. బీజేపీ విదేశ్వాగ్ని రగులుస్తోందని, మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను టార్గెట్ చేసుకుంటోందని విమర్శించారు.
రాజ్యాంగ నిర్దేశిత విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
కాగా, ఇతర విపక్ష పార్టీలతో పొత్తులతో సహా 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఈ ప్లీనరీలో తీసుకోనున్నారు. ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతులు(ఓబిసి),మహిళలు, యువకులు, మైనారిటీలకు కార్యవర్గంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ తన రాజ్యాంగాన్ని సవరించింది.
పార్టీ సవరించిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లూసి)లో పార్టీకి చెందిన మాజీ ప్రధాన మంత్రులు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు ఉంటారు. సిడబ్లూసి సభ్యుల సంఖ్య 25 నుంచి 35కు పెరుగుతుంది. ఇకపై పార్టీకి డిజిటల్ సభ్యత్వం, రికార్డులు మాత్రమే ఉంటాయని సవరించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం చెబుతోంది.