తక్షణమే టీఎస్పీఎస్పీ, టెన్త్ పేపర్ లీకేజీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బాధ్యులైన మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని కోరారు. టీఎస్పీఎస్పీ, టెన్త్ పేపర్ల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులు కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నడా? అసలు పాలన ఉందా? అనే అనుమానం కలుగుతోందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అయ్యింది. సోమవారం టెన్త్ క్లాస్ తెలుగు పశ్నాపత్రం లీకైంది. మంగళవారం హిందీ పేపర్ లీకైంది. అసలేం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని, పరీక్షలంటే లెక్కలేని తనం కన్పిస్తోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. గతేడాది ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పిదాలతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరని గుర్తు చేశారు.
రెండేళ్ల క్రితం టెన్త్ పేపర్ లీకైందని చెబుతూ జవాబు పత్రాల బండిళ్లు రోడ్లపై ప్రత్యక్షమవుతున్నా పట్టించుకోని దుస్ధితి నెలకొందని విమర్శించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో బాధ్యత వహించాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన తప్పిదాలను బీజేపీపై నెట్టే కుట్రకు పాల్పడటం సిగ్గు చేటని విమర్శించారు.
డ్రగ్స్, పత్తాలు, భూములు, దొంగ సారా దందాతో సంపాదించిన డబ్బులు చాలడం లేదని బీఆర్ఎస్ నేతలు పేపర్ లీకేజీమీద పడ్డరని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులకు అమ్ముకుని కోట్లు సంపాదిస్తూ ప్రభుత్వ, చిన్న పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నా పత్రాలంటే బీఆర్ఎస్ నేతలకు నోట్ల కట్టలుగా మారినయని ఆరోపించారు. విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్ కేసీఆర్ కుటుంబానికి వ్యాపారంగా మారిందని విమర్శించారు. జవాబు పత్రాలంటే వాళ్లకు మిఠాయి పొట్లాలతో సమానమైందని అంటూ రేపటి భావి భారత పౌరుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
మంత్రులు రబ్బర్ స్టాంపుల్లా మారారని అంటూ వాళ్లకు అసలు వాళ్ల శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అన్నీ శాఖల అధికారులను సీఎం కుటుంబం తమ గుప్పిట్లో పెట్టుకుని మంత్రులను రబ్బర్ స్టాంపుల్లా మార్చిందని విమర్శించారు.