కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశంలో కరోనా పరిస్థితులపై ఆయన ఉన్నతాధికార సమీక్ష గతరాత్రి జరిపారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు.
కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాల ని, జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలని ప్రధాని చెప్పారు. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు.
టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలని, కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని వివరించారు. కాంటాక్ట్ ట్రాకింగ్ సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టే చర్యలపై శ్రద్ధవహించాలని, తక్కువ టీకా రేటు, ఎక్కువ కేసులున్న ప్రాంతాలకు బృందాలను పంపాలని ఆదేశించారు.
రాత్రి కర్ఫ్యూ … కేంద్రం మార్గదర్శకాలు
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి వరకు దాదాపు మూడు వందలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు అనేక సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని, ఒమిక్రాన్ ముప్పు వ్యాపించకముందే ఆంక్షలు అమలు చేయాలని సూచించారు.
ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమలులో ఉండేలా చూడాలన్నారు.ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి పండగల వేళ రాత్రి కర్ఫూలను అమలు చేయాలని, భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని సూచించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి, నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు.
బాధితుల నమూనాలను ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలన్నారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, ఆస్పత్రుల్లో పడకల సామర్ధం, అంబులెన్ను, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మాస్క్‌లు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలన్నారు. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమం ముమ్మరం చేయాలని, రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా రానప్పటికీ వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గురువారం రాత్రి నుంచే నైట్ కర్ఫ్యూ అమలుకు సిద్ధమయ్యారు.
రాత్రి 11 గంటల నుంచి తెల్లారి ఐదు గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన చెప్పారు. అవసరమైతే మరిన్ని ఆంక్షలు పెడతామని చెప్పారు.
60 శాతం మందికి టీకాలు
దేశ ప్రజల సహకారం, హెల్త్‌కేర్ వర్కర్ల నిస్వార్థ సేవతో దేశంలో ఇప్పటివరకు అర్హులైన 60 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇది కాకుండా వయోజనుల్లో 89 శాతం మందికి మొదటి డోసు ఇవ్వడం పూర్తయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
గత 24 గంటల్లో 70,17,671 డోసులు పంపిణీ అయ్యాయని, దీంతో దేశం మొత్తం మీద ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 139.70 కోట్లు దాటిందని తెలిపాయి.