ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుందని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి. బుధవారం విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, తారకరామ తీర్థసాగర్, చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్, అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సిఎం జగన్ పునాది రాళ్లు వేశారు. అనంతరం విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తూ రానున్న కాలంలో ఉత్తరాంధ్రుల కోసం తీసుకురానున్న అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల గురించి వివరించారు.
చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిరోపోర్టుకు శంకుస్థాపన చేశామని, ఇందుకు ఎంతో చిత్తశుద్ధితో పనిచేశామని చెప్పారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్ ఎయిరోపోర్టు టేక్ ఆఫ్ అవుతుందని, రూ.23.73 కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టామని తెలిపారు.
ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలస ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు జాబ్ హబ్‌గా మారబోతోందని తెలిపారు. ఈ ప్రాంతానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీర్తికిరీటంగా నిలవబోతోందని అభివర్ణించారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వైభవానికి భోగాపురం ఎయిర్‌పోర్టు కేంద్ర బిందువుగా నిలవబోతోందని చెప్పారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నగరాలకు దాదాపు సమానదూరంలో ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. మరో మూడేళ్లలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం పూర్తవుతుందని, 2026 నుంచి ఇక్కడ విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే తాను నివాసముంటానని జగన్ పునరుద్ఘాటించారు.
మరో రెండు మంచి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామని సిఎం జగన్ తెలిపారు. విజయనగరం జిల్లాలో 49 గ్రామాలు, విజయనగరం పట్టణం, భోగాపురం ఎయిర్‌పోర్టుకు తాగునీటితో పాటు సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే తారకరామతీర్థ సాగర్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రూ.195 కోట్లను ఖర్చు చేస్తూ శంకుస్థాపన చేశామని తెలిపారు.
ఈ పనులన్నీ 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు అంకితమిస్తామని హామీ ఇచ్చారు. చింతపల్లిలో రూ.24 కోట్లతో ఫిష్‌లాండ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశామని చెప్పారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని సిఎం జగన్ వివరించారు.