దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 470 కి పైగా దాటిపోయింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. నిన్న అక్కడ మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసులు 110కి చేరుకున్నాయి.
రాజస్థాన్‌లో కొత్తగా 21, మహారాష్ట్రలో 2, కేరళలో 1, గుజరాత్ లో 6, కర్ణాటకలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న, వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతున్న 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను ఇవాళ పంపనుంది కేంద్ర వైద్యశాఖ. రాష్ట్రాల ఆరోగ్య శాఖతో కలసి మల్టీ డిసిప్లినరీ టీమ్స్ పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
కాంటాక్ట్ ట్రేసింగ్, సర్వీలెన్స్, కంటెయిన్మెంట్ ఆపరేషన్స్, టెస్టింగ్, కరోనా అప్రాప్రివియేట్ బిహేవియర్, హాస్పిటల్ బెడ్స్ లభ్యత, ఆంబులెన్స్, వెంటిలేటర్స్, మెడికల్ ఆక్సిజన్ లాంటివి అందుతున్నాయా..? లేదా అనే విషయాలతో పాటు… వ్యాక్సినేషన్ ప్రోగ్రెస్ ను సెంట్రల్ టీమ్స్ పరిశీలించనున్నాయి.
కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను నిషేధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాలు ఆంక్షలు విధించగా.. తాజాగా అసోం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి కర్ఫ్యూని పకడ్బంధీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోంది. వందకు పైగా దేశాలకు వ్యాపించాయి. ఇప్పటి వరకు లక్షా 83 వేల 240 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒమిక్రాన్ తో ప్రపంచ వ్యాప్తంగా 31 మంది మృతి చెందారు. యూకేలో అత్యధికంగా లక్షా 14 వేలకుపైగా కేసులు ఉన్నాయి. అక్కడ 29 మరణాలు నమోదయ్యాయి.
డెన్మార్క్ లో 32 వేల 877 కేసులు ఉండగా.. కెనడాలో 7500 కేసులు ఉన్నాయి. ఇక అమెరికాలో 6,331 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఫ్రాన్స్ లో సాధారణ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే లక్ష కేసులు వచ్చాయి.
డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ప్రభావం తక్కువే అయినప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2022లో ప్రపంచంలో ఒమిక్రాన్ ఆధిపత్య(డామినెంట్) మహమ్మారిగా మనగలుగుతుందని సింగపూర్ వైద్యనిపుణులు అంచనా వేశారు. డెల్టా వేరియంట్‌కన్నా వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు వ్యాక్సిన్లను తప్పించుకునేలా తయారైందని వారు తెలిపారు.
మరోవైపు కరోనా మహమ్మారికి 2022లో చరమగీతం పాడాలని ప్రపంచ ఆరోగ్యసంస (డబ్లూహెచ్‌ఒ) పిలుపునిచ్చింది. డబ్లూహెచ్‌ఒ పిలుపును గుర్తు చేస్తూ.. మహమ్మారి అంత్యదశను అంచనా వేయాలంటే ఒమిక్రాన్‌కు సంబంధించి మరింత డేటాను సేకరించాల్సి ఉన్నదని సింగపూర్ వైద్య నిపుణులు అంటున్నారు.
పెరుగుతున్న కేసులు, ఆస్పత్రుల్లో చేరికలతో ఒమిక్రాన్ వల్ల జరిగే నష్టం పట్ల ఇంకా స్పష్టత లేదని సింగపూర్ ప్రజా ఆరోగ్య నిపుణురాలు నటాషా హోవార్డ్ చెప్పారు. ప్రజా ఆరోగ్య నిపుణులు ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఏమేరకు పని చేస్తున్నాయన్నదానిపై మూల్యాంకనం చేస్తున్నారని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని ఆమె తెలిపారు.
1918లో వచ్చిన ఫ్లూ మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం(సిడిసి) చెబుతోందని మరో నిపుణులు, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ లిమ్వీకియట్ గుర్తు చేశారు. శతాబ్దం దాటినా ఫ్లూ ఇంకా వస్తూనే ఉన్నదని తెలిపారు.