బిజెపి బలహీనమయితే ఎప్పటికైనా తానే ప్రధాని కాగలననే అమిత విశ్వాసంతో ఏకపక్ష ధోరణులతో వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శాపంగా ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలే వాపోతున్నారు.
ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఖచ్చితంగా పంజాబ్ లో గెలుపొంది, తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్న సమయంలో కేవలం రాజకీయంగా నిలకడలేని నవజ్యోత్ సింగ్ సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి, సుదీర్ఘకాలం కాంగ్రెస్ కు బలమైన నేతగా ఉన్న కెప్టెన్ అమరిందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేటట్లు చేశారు.
అమరిందర్ సింగ్ మరో పార్టీ పెట్టి, బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకోవడం, సిద్దు కొత్త ముఖ్యమంత్రితో కూడా సఖ్యతతో ఉండక పోవడంతో ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మూడో లేదా నాలుగో స్థానంకు దిగజారడం ఖాయంగా కనిపిస్తున్నది.
అంతకు ముందు మధ్య ప్రదేశ్, కర్ణాటక వంటి పలు రాష్ట్రాలలో రాహుల్ గాంధీ ఒంటెత్తు పోకడల కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయాయి. రాజస్థాన్ లో కూడా అటువంటి ప్రయత్నం జరిగినా, అక్కడ ముఖ్యమంత్రి తట్టుకొని నిలదొక్కుకున్నారు.
సొంత పార్టీకి నష్టం కలిగించే అంశాలను ప్రస్తావించడంలో రాహుల్ గాంధీకి ఉన్న `నైపుణ్యం’ మరెవ్వరికీ ఉండబోదని చెప్పవచ్చు. ఈ మధ్యనే అధిక ధరలకు నిరసనగా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని జైపూర్ లో భారీ బహిరంగ సభ జరిపారు. ఢిల్లీలోనే ఆ సభ జరుపుదామని అనుకున్నా, అక్కడ పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో తమ ప్రభుత్వం ఉన్న జైపూర్ కు వెళ్లారు.
అంతకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఏ అంశాలను ప్రచార అంశాలుగా చేసుకోవాలనే విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ద్రవ్యోల్భణం అంశాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని సూచించింది. ఆ సూచనా మేరకే జైపూర్ లో బహిరంగ సభ పెట్టారు.
ధరల పెరుగుదల గురించి కాకుండా `హిందూ మతం – హిందుత్వం’ అంశంపై మోదీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి రాహుల్ గాంధీ మరోసారి తన `అవివేకం’ను ప్రజల ముందు ప్రదర్శించి, పార్టీ నాయకుల ముందు కూడా నవ్వులపాలయ్యారు.
ఈ వాఖ్యలు ఒక విధంగా తాత్వికమైనవి కావడంతో సాధారణ ప్రజలను ఆకట్టుకోవడంకు ఉపయోగపడలేదు. ఉత్తర ప్రదేశ్ లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, బిజెపిని దోషిగా నిలబెట్టేందుకు రాహుల్ ఈ ప్రస్తావన తెచ్చిన్నట్లు భావిస్తున్నారు. బిజెపి నుండి `హిందుత్వ’ కార్డును అపహరించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేతలే ఎద్దేవా చేస్తున్నారు.
`హిందుత్వ’ అనగానే ప్రజలు సాధారణంగా బిజెపి వైపు చూస్తారు. ఈ విషయంలో బిజెపికి ఉన్న నిబద్దత, సైద్ధాంతిక పునాది మరే పార్టీకి లేదన్నది అందరికి తెలిసిందే. పైగా, కాంగ్రెస్ నేతలు `హిందుత్వ’ గురించి మాట్లాడడాన్ని ప్రజలు అవహేళన చేస్తుంటారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో దేవాలయాల సందర్శనతో `హిందుత్వ’ కార్డు ను హైజాక్ చేయాలని ప్రయత్నించిన రాహుల్ గాంధీ బొక్కబార్ల పడటం తెలిసిందే.
వాస్తవిక అధికారికంగా ఎటువంటి పదవి లేకుండా, మొత్తం కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం వహిస్తున్న రాహుల్ గాంధీ తరచుగా సలహాదారులను సంప్రదించకుండా ఆకస్మికంగా వ్యవహరిస్తుంటారు. తానెంతో తెలివిగల నేత అనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలే కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారుతున్నాయి.