శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు ప్రతిపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయాలనే కసరత్తు దాదాపు నెలరోజులుగా సాగుతోంది. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత సోమణ్ణ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తానంటూ ముందుకొచ్చారు.
ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నలిస్కుమార్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తనవంతుగా కృషి చేస్తానని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, అధ్యక్ష పదవి ఇస్తే వంద రోజుల్లోనే పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది చూపుతానని సోమన్న తెలిపారు. రెండుసార్లు ఢిల్లీ వెళ్లి సీనియర్ నేతలను కలిశానని, పలు విషయాలు ప్రస్తావించానని చెప్పారు. 45ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, అధ్యక్ష పదవిని నిభాయిస్తానని వివరించానని చెబుతూ ఏళ్ల కాలంగా పార్టీ సూచించిన అన్ని పరీక్షల్లోనూ వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్లానని పేర్కొన్నారు.
పార్టీలో సీనియర్ నని అందరినీ పరిగణనలోకి తీసుకుంటానని పేర్కొంటూ బీఎస్ యడియూరప్ప తరహాలో రాజకీయం చేసిన వాడినని తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మినహాయించి అగ్ర నేతలైన అమిత్‌షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌లతో కలసి పార్టీ అధ్యక్ష పదవిని కోరానని వెల్లడించారు.
కాగా, సోమణ్ణ అనుభవం కల్గిన వారని, పార్టీ అధ్యక్ష పదవి కోరడంలో తప్పు లేదని పార్టీ సీనియర్ నేత యడియూరప్ప చెప్పారు.