తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మరోసారి తనను నియమించడం పట్ల తాను అలిగిన్నట్లు వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ విధానంకు కట్టుబడి ఉంటానని, ప్రధాని మోదీ వరంగల్ పర్యటన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు.
బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంకు తాను హాజరు కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారవేస్తూ కాబినెట్ మార్పులు జరిగేవరకు మంత్రి పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను పార్టీకి విధేయుడినని.. క్రమశిక్షణ గల కార్యకర్తనని చెప్పుకొచ్చారు.
గతంలోనూ తాను రెండు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశానన్న కిషన్ రెడ్ అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని చెప్పారు. “కేంద్రమంత్రిగా ప్రధాని నాకు బాధ్యతలు ఇచ్చారు. నాకు ఫలానా కావాలని పార్టీ ఎప్పుడూ ఏదీ అడగలేదు. పార్టీ గుర్తించి ఇచ్చిన అన్ని పదవులను నిర్వర్తించా. పార్టీ విధానానికి కట్టుబడి ఉంటా” అని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెబుతూ పలు అభివృద్ధి పనులకు మోదీ ఈనెల 8న శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆ సభ నిర్వహణ విషయమై ఇవాళ తాను, బండి సంజయ్ హైదరాబాద్ చేరుకొని స్థానిక నేతలతో చర్చిస్తామనిని కిషన్ రెడ్డి మీడియాతో వెల్లడించారు.